ఖమ్మంలోని ప్రధాన కూడలిలో బీజేపీ జెండాలు
సాక్షి హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న ‘రైతు గోస–బీజేపీ భరోసా’ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆదివారం మధ్యా హ్నం 3 గంటల తర్వాత ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు అమిత్‌షా చేరుకుంటారు.
ఈ సభలో రైతుల సమస్యలను ప్రస్తావించడంతోపాటు పరిష్కారానికి బీజేపీ ఏం చేయనుందనే అంశాన్ని వెల్లడిస్తారు. త్వరలో జరగ నున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సభకు భారీగా జనసమీకరణతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ కేడర్ పాల్గొనేలా చేయడం ద్వారా సభ సక్సెస్ చేసి సత్తా చాటాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా రైతులను అధిక సంఖ్యలో సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బస్సు యాత్రలపై రాష్ట్రనేతలతో సమావేశం
అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనకు నిర్దేశించిన సమయం తక్కువగా ఉండడంతో భద్రాచలంలో శ్రీరాముల వారి దర్శనం, అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం రద్దయినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. సభ అనంతరం ఖమ్మంలోనే బీజేపీ రాష్ట్రస్థాయి కోర్ కమిటీ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు.. బాసరలోని సరస్వతి అమ్మవారి దేవాలయం, జోగుళాంబ అమ్మ వారి గుడి, భద్రాచలం శ్రీరాముల దేవాలయం నుంచి.. వచ్చేనెల 7 తర్వాత ముఖ్యనేతలు 3 బస్సుయాత్రలు చేపట్టి సెప్టెంబర్ 17న ముగించి భారీ సభ నిర్వహించే అంశంపై అమిత్‌షాతో రాష్ట్రనేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా అమిత్‌షా సమక్షంలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతరనేతలు చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు వెల్లడించాయి.
బహిరంగ సభ విజయవంతం కోసం..
సభను విజయవంతం చేయడం కోసం బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు సర్వశక్తులొడ్డాయి. కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న బీజేపీ అగ్ర నేత జిల్లాకు వస్తుండడం ఇదే ప్రథమం కావడంతో నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో ఖమ్మం కాషాయమయంగా కనిపిస్తోంది. సభా ప్రాంగణంలో అమిత్‌షా, ప్రధాని మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ శనివారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. సభకు ‘రైతు గోస..బీజేపీ భరోసా’ అని నామకరణం చేశారు.
భారీ బందోబస్తు..
అమిత్‌షా సభ కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం అధికారులతో సమీక్షించారు. సీఆర్‌పీఎఫ్ అధికారులు బందోబస్తును ప్రత్యేకంగా పరిశీలించారు.
రైతుల ఇబ్బందులు తొలిగేలా ఖమ్మం సభలో ప్రకటన : బీజేపీనేత ప్రేమేందర్‌రెడ్డి
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు భరోసా కల్పించి, వారి ఇబ్బందులు తొలగించే విధంగా బీజేపీ నాయకత్వం ఖమ్మం సభలో రైతు భరోసా ప్రకటన చేయనున్నదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు
అమిత్ షా షెడ్యూల్ ఇలా....
– ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.25 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.50 నిముషాలకు ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు
–అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు
–3.40 నిమిషాలకు ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్ బహిరంగసభ ప్రాంగణానికి వస్తారు
–3.45 నిమిషాల నుంచి సాయంత్రం 4.35 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు
–అక్కడి కాలేజీ ప్రాంగణంలోనే 4.40 నిముషాల నుంచి సాయంత్రం 5.30 దాకా పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు
–సాయంత్రం 5.50 నిమిషాలకు ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 6.20 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు
–సాయంత్రం 6.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు
Comments
Please login to add a commentAdd a comment