మంగళవారం ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సాక్షి, ఆదిలాబాద్: బీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తైన కారు స్టీరింగ్ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో నడిచే కేసీఆర్ సర్కార్‌ను పీకి పారేద్దామని, డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కమలం సర్కార్‌ను తీసుకొ ద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ్టి రజాకారుల నుంచి బీజేపీతోనే రక్షణ లభిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జనగర్జన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
కేటీఆర్‌ను సీఎం ఎలా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన
ప్రధాని మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని అమిత్‌షా చెప్పారు. ఇటీవల మోదీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రూ.950 కోట్లతో సమ్మక్క–సారక్క యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారని, వాస్తవానికి దీన్ని 2014 నుంచే ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ కేసీఆర్ సర్కార్ స్థలం ఇవ్వకపోవడంతో ఆలస్యమైందని విమర్శించారు.
గిరిజనుల ఉన్నత చదువులకు, అలాగే వారి సంస్కృతి, ఆచారాలను కాపాడేందుకు వర్సిటీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు సాగు అధికంగా ఉన్న దృష్ట్యా ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఆ రైతుల అభ్యున్నతికి దోహద పడుతుందని తెలిపారు. కృష్ణా జలాల వివాదాన్ని ఇటీవల కేంద్ర కేబినెట్‌లో చర్చించి తెలంగాణలో నీటి సమస్య తీర్చేవిధంగా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కూడా కేంద్ర సర్కార్ సఫలీకృతమైందని చెప్పారు.
జనవరిలో భవ్య రామమందిర్ ప్రారంభం
ఎన్నికలు వచ్చాయంటే కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకొని వస్తారని, ఇటీవల రాహుల్ బాబా ఏదేదో చేస్తామని చెబుతూ తిరుగుతున్నారని అమిత్ షా విమర్శించారు. ఆదివాసీల సంక్షేమం కోసం యూపీఏ ప్రభుత్వం 2013–14లో రూ.24 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రూ.1.24 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, కానీ తమపై అవినీతి ఆరోపణలు చేసే అవకాశం కూడా లేకుండా పోయిందని అన్నారు. ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగంగా చేశామని చెప్పారు. వచ్చే జనవరిలో అయోధ్యలో భవ్య రామమందిర్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
కేసీఆర్‌కు ఏమైందో చెప్పాలి: సంజయ్
అమిత్‌షా ప్రసంగానికంటే ముందు కిషన్‌రెడ్డి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. కానీ గొంతు బొంగురు పోవడంతో ఆగిపోయారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు సభలో జనం నుంచి విశేష స్పందన కనిపించింది. బీజేపీ ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించిందని, సైరన్ మోగించామని, కార్యకర్తలు సిద్ధం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు. సీఎం గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని, ఆయనకు ఏమైందో చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. కేసీఆర్ సార్‌కు రక్షణ కల్పించాలని, ఆయన విషయంలో తనకు ఆందోళనగా ఉందని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రసంగం ప్రారంభించే ముందు రెండు చేతులు పైకెత్తిన అమిత్‌షా.. కేసీఆర్‌ను మార్చివేసి, మోదీ సర్కార్‌ను తెచ్చేందుకు పిడికిలి బిగించాలంటూ పిలుపునిచ్చారు. అనంతరం ‘భారత్ మాతాకీ జై’అంటూ ఆయన చేసిన నినాదానికి సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది.
సభలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యలు,అకృత్యాల్లోనే నంబర్ వన్
ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలు, రైతులు, దళితులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాల కోసం చేసిందేమీ లేదని అమిత్ షా ధ్వజమెత్తారు.కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం ఎలా? అనే ఒక చింత తప్పితే కేసీఆర్‌కు మరొకటి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నంబర్ వన్‌గా ఉందనే ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, అయితే రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అకృత్యాలు, అవినీతిలో మాత్రమే ఈ ప్రభుత్వం నంబర్ వన్‌గా ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment