అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడమే ఎంఐఎంకు అలవాటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ సిటీ: అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడమే ఎంఐఎంకు అలవాటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎంఐఎంతో పొత్తు ఉండదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటన హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం పొత్తు పెట్టుకోవడానికి సిద్దమైందన్నారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌తో ఎంఐఎం ఉండదన్నారు. ఎంఐఎంతో పొత్తు ఉండదని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం మాస్యాస్పదన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అండతోనే ఎంఐఎం ఒక్క సీటు నుంచి 7 సీట్లకు పెరిగిందన్నారు. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతుతోనే హిందువులు పాతబస్తీలో ఉండాలంటే భయపడే దుస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ చార్మినార్ దగ్గర ముక్కును నేలకు రాయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను మరిచి అధికారం చెలాయిస్తున్నదని ఆరోపించారు.
రైతులకు రుణమాఫీ చేయకుండా, కరువును ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. పత్తి కొనుగోలుకోసం రాష్ట్రప్రభుత్వం చేస్తున్నదేమిటో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా పత్తి రైతుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా మహారాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ను చెల్లిస్తున్నదన్నారు.
సీసీఐతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పత్తిని కొనుగోలు చేస్తున్నదని, బోనస్‌ను కూడా చెల్లిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని, బోనస్‌ను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. పత్తి కొనుగోలులో దళారుల వ్యవస్థను నిర్మూలించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆన్‌లైన్‌లోనే పత్తిరైతులకు నేరుగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొనుగోలుతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా క్వింటాలుకు 500 బోనస్‌ను చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.