సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలది ముక్కోణపు ప్రేమ కథ (ట్రయాంగిల్ లవ్‌స్టోరీ) అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, మూడూ కుటుంబ, అవినీతి పార్టీలేనని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పేరిట ఢిల్లీలో ఈ మూడు పార్టీలు ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘ఈ పార్టీలు గతంలో కలిశాయి.. ఇప్పుడూ కలిశాయి.. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాయి..’ అని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
ఒకే తాను ముక్కలే..
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా మూడు పార్టీలకు వేసినట్లే. బీజేపీ ఈ మూడు పార్టీలతో గతంలో కలవలేదు. భవిష్యత్తులోనూ కలవదు. ఈ మూడు పార్టీలపై పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే మోదీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం..’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణలో 4 వేల కిసాన్‌సేవా కేంద్రాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల రిటైల్ షాపులను గురువారం నుంచి ‘ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలు’గా మార్చుతున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ఒకే దేశం.. ఒకే ఎరువు అనే నినాదంతో, భారత్‌బ్రాండ్‌పేరుతో గురువారం నుంచి ఎరువుల సరఫరా అమల్లోకి రానున్నట్టు తెలిపారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. తొలిదశలో 1.25 లక్షల షాప్‌లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్ షాపులు కిసాన్‌సేవా కేంద్రాలుగా మారతాయని చెప్పారు. ఈ మేరకు శామీర్‌పేటలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు.
ప్రతి నెల రెండో ఆదివారం ‘కిసాన్ కీ బాత్’
రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకేచోట అందించేందుకు వీలుగా ఎరువుల రిటైల్‌షాపులను ప్రధానమంత్రి కిసాన్‌సేవా కేంద్రాలుగా కేంద్రం మార్చుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులు, భూసార, విత్తన పరీక్షల కోసం వేర్వేరు చోట్లకు రైతులు వెళ్లకుండా అన్ని రకాల సేవలు..ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో లభిస్తాయని వివరించారు.
సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, కిసాన్‌సమ్మాన్‌యోజన వంటి కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. రైతు సమస్యలపై ‘కిసాన్‌కీ బాత్’ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రతి నెల రెండో ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
నేడు రైతుల ఖాతాల్లోకి ‘కిసాన్ సమ్మాన్’ నిధులు
14వ విడత పీఎం కిసాన్‌సమ్మాన్‌నిధులను గురువారం ఉదయం ప్రధాని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని సుమారు 39 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు.
వారిది ముక్కోణపు ప్రేమ కథ!
Published Thu, Jul 27 2023 4:43 AM | Last Updated on Thu, Jul 27 2023 8:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment