సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోని భూములతోపాటు రైతుల భూములకూ ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలనను పక్కనబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. గ్రామాల్లో ధరణి పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని, ఇవ్వకుంటే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వ భూములను అమ్ముతోందని. ఇదేమిటని ప్రశ్నించేవారిని అణచివేస్తోందని మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి, హైదరాబాద్ సమీపంలోని విలువైన భూములను కావాల్సిన వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
నిర్మల్‌లో నిలదీస్తే దాడులా?
నిర్మల్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ పేరిట భూమాయ జరుగుతోందని.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా, రైతుల భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్‌లో సోఫీనగర్ ఇండ్రస్టియల్ జోన్‌ను రెసిడెన్షియల్‌గా మార్చేందుకు జీవో తెచ్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని.. దీనికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని విమర్శించారు.
పోలీసుల దాడిలో దాదాపు 30 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురి తల పగిలి గాయాలయ్యాయని చెప్పారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా నాయకురాలనే గౌరవం లేకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్‌చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నిస్తే అణచివేస్తారా?
ఆదిలాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిపైనా లాఠీచార్జి చేసి, బట్టలు చించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి సూర్యాపేటకు వెళితే అక్కడి బీజేపీ నేతలను అరెస్టు చేశారన్నారు. సీఎం, ఆయన కుమారుడు ఎక్కడికి వెళ్లినా బీజేపీ, ఇతర ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
కల్వకుంట్ల కుటుంబంలో అభద్రతాభావం ఏర్పడిందని.. వారి అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండేది నాలుగు నెలలేనని, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పక్షపాతం మంచిది కాదని హితవు పలికారు.
పోలీసులు మహిళలనూ కొట్టారు: ఈటల
తెలంగాణలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్టుగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్‌లో వందలమంది మహిళలను మగ పోలీసులు విపరీతంగా కొట్టారని ఆరోపించారు. లంబాడీ మహిళల పట్ల కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్‌లో పనిచేసే బొమ్మ శరత్‌లను మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుపోయి బయటి ప్రాంతాల్లో తిప్పుతూ విపరీతంగా కొట్టారని.. హుజూరాబాద్‌లో చెల్పూరు సర్పంచ్ మహేందర్‌ను అలాగే కొట్టి హింసించి, పైశాచికానందనం పొందారని ఆరోపించారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు.
కేసీఆర్ సర్కార్‌ది రియల్ ఎస్టేట్ కంపెనీ
Published Mon, Aug 21 2023 5:19 AM | Last Updated on Thu, Aug 24 2023 3:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment