మద్దతివ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయలేం!
తెలంగాణ బీజేపీ నేతల స్పష్టీకరణ
నేడు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు మద్దతివ్వకపోతే ఆ ప్రాంతంలో బీజేపీ కుదేలయినట్టేనని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అభిప్రాయపడింది. విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యమ కమిటీ నేతలు, పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదివారమిక్కడ భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, ప్రొఫెసర్ శేషగిరిరావు, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఎస్.కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. బిల్లుకు పార్లమెంటులో మద్దతివ్వకపోతే తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని జిల్లాల నేతలు తెగేసిచెప్పారు. పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకమేనన్నారు. పూర్తి స్థాయి మద్దతివ్వడానికే పార్టీ కట్టుబడి ఉందని మురళీధర్‌రావు చెప్పారు. పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి పెంచడానికి సోమవారం భారీ సంఖ్యలో నేతలు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
కిరణ్‌ను ఎందుకు డిస్మిస్ చేయరు?: దత్తాత్రేయ
తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతున్న సీఎం కిరణ్‌ను ఎందుకు డిస్మిస్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ సోనియాగాంధీని ప్రశ్నించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకంలో ఇది భాగం కాదా? అని నిలదీసింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ ఆదివారమిక్కడ పార్టీ నేతలు టి.రాజేశ్వరరావు, మల్లారెడ్డి, దాసరి మల్లేశంతో కలసి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్నే బాహాటంగా సవాల్ చేస్తున్న కేంద్ర మంత్రులపై చర్య ఎందుకు తీసుకోవడం లేదన్నారు.