
కొత్త ఓటర్లపై గురిపెట్టండి: మోడీ పిలుపు
ఢిల్లీ పీఠమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కును పొందినవారిని, యువతను, మైనారిటీ ప్రజలను ఆకర్షించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని, దీన్ని అనుకూలంగా మలచుకొని కమలం పార్టీని బూత్‌స్థాయి నుంచి క్రియాశీలకం చేయాలని సూచించింది.
ఆదివారమిక్కడ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ ఎన్నికల ప్రచారసారథి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్న ఈ భేటీలో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మొదటిసారి ఓటు హక్కు పొందినవారితోపాటు యువత మార్పును కోరుకుంటోందని, వీరిపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ వైపు మళ్లించాలని చెప్పారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 20-25 శాతం ముస్లింలు బీజేపీకి ఓటేశార ని, ఇదే విధంగా ఆ వర్గం వద్దకు పార్టీని తీసుకువెళ్లాలని తెలిపారు. ముస్లింల్లో సున్నీ, షియా తదితర వర్గాల సమస్యలను లేవనెత్తుతూ వారికి దగ్గర కావాలని సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 272 సీట్లకుపైగా ఎంపీ స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు.
అధిక ధరలు, రూపాయి పతనం, నిరుద్యోగం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పాలక కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. గడచిన 10 రోజుల్లో సరిహద్దుల వెంట పాకిస్థాన్ 18సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని, అయినా ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఆరుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు సుష్మస్వరాజ్, అరుణ్‌జైట్లీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఏపార్టీతో పొత్తులుండవు: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏపార్టీతోనూ తమకు పొత్తులు ఉండవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలకూ బీజేపీ పోటీ చేస్తుందని, ఒంటరిగానే మెజార్టీ సీట్ల గెలుపునకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు, పార్టీ పటిష్టత, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించడానికి ఆదివారం పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో బీసీ ఉప ప్రణాళిక కోసం మహాధర్నా నిర్వహిస్తామన్నారు.
చర్చంతా పార్టీ పటిష్టతపైనే
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్యనేతలు హాజరైన ఈ కీలక సమావేశంలో పార్టీ పటిష్టత, సంస్థాగత నిర్మాణం బలోపేతంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని పార్టీ అగ్రనేత ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 270 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించడానికి క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తామన్నారు
దక్షిణాదిలో మరిన్ని మోడీ సభలు
బీజేపీ ఎన్నికల ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభ విజయవంతం కావడంతో దక్షిణాదిలో మరిన్ని మోడీ సభలను నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మోడీ ప్రసంగాన్ని వినేందుకు హైదరాబాద్ సభకు లక్షకుపైగా ప్రజలు హాజరయ్యారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఢిల్లీలో తెలిపారు.
ఆ సభ విజయవంతమైన నేపథ్యంలో దక్షిణాదిలో మోడీ చేత మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తమిళనాడులో త్వరలోనే మోడీ సభ ఉంటుందన్నారు. రాజస్థాన్‌లో తమ పార్టీ నాయకురాలు వసుంధరారాజె సింధియా చేపట్టిన సూరజ్ సంకల్ప్ యాత్ర ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 9న జైపూర్‌లో మోడీ సభ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు.