సభలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో రాంచందర్‌రావు, కె.లక్ష్మణ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదని, ఇది శరణార్థుల కోసం ఉద్దేశించిన చట్టం అని కేంద్ర హోం సహయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది దేశంలో ఏ ఒక్క ముస్లింకు, మరే ఇతర మతస్తులకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వామపక్షాలు, మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను విభజించే పద్ధతిలో రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని ధర్నాలు, నిరసనలు చేసినా సీఏఏను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు.
ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఏఏకు మద్దతుగా సోమవారం ప్రజా ప్రదర్శన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానులు ఆయా దేశాల్లో ఉన్న మైనార్టీలపై మతదాడులు జరగకుండా రక్షణ కల్పించాలని చేసుకున్న ఒప్పందాలను పాకిస్తాన్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్ దేశాలుగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్‌ఎస్‌తో పాటు మేధావులకు సీఏఏపై జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ సైతం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్దకు వస్తే చర్చించడానికి సిద్ధమన్నారు.
ఎన్పీఆర్‌కు డాక్యుమెంట్ తప్పనిసరి కాదు
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌లో (ఎన్పీఆర్) వివరాల నమోదుకు డాక్యుమెంటు ఇవ్వాలన్న నిబంధన లేదని జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్పీఆర్‌పై అవగాహన లేక రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగణన (సెన్సెస్) ప్రక్రియనే అప్‌డేట్ చేసి ఎన్పీఆర్ పేరిట వివరాలు సేకరిస్తున్నట్లు వివరించారు. సోమవారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనగణన వల్ల సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికే అందుతాయన్నారు.
పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదు..
పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదని, వారిపై దాడులు చేయడం వల్ల 200 మంది ఆస్పత్రి పాలయ్యారని కిషన్‌రెడ్డి తెలిపారు. దీనికి తోడు నిరసనల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం చేశారని, ఆస్తులకు నష్టం చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పారు. ఆస్తులకు నష్టం చేకూర్చిన వారి నుంచి రికవరీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లనే దేశ విభజన జరిగిందని ఆరోపించారు. పాకిస్తాన్‌కు వంతపాడే రీతిలో ఎంఐఎం నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నిర్వహించిన సభకు తెలంగాణ మంత్రులు ఎలా హజరయ్యారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎంఐఎం తోక పార్టీగా మారిం దని విమర్శించారు. కేసీఆర్ ఒవైసీ ఒత్తిడికి లొంగిపోతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment