పార్టీల విశ్వసనీయతకు పరీక్ష
తెలంగాణ బిల్లుపై కిషన్‌రెడ్డి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిల్లు రాజకీయ పార్టీల విశ్వసనీయతకు పెద్ద పరీక్ష అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. టీ బిల్లును పార్లమెంట్‌లో గెలిపించి తమ విశ్వసనీయతను నిరూపించుకుంటామని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ శైలేష్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీ బిల్లును ముందుగా రాజ్యసభలో ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుందో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసినప్పటికీ సీమాంధ్ర నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రజల మధ్య విద్వేషాలు పెంచవద్దని సూచించారు.
పదకొండు వందల మంది ఆత్మహత్యలకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే కారణమని, సోనియాగాంధీ తమ పాలిట దెయ్యమేనని చెప్పారు. మోడీ పట్ల ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలిచేందుకు కార్యకర్తలు వచ్చే 60రోజులను పార్టీకి పూర్తిగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ విధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నానని, మోడీతోనే ఉత్తమ పాలన సాధ్యమని నమ్ముతున్నానని శైలేష్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.