సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయామని, విభజన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. బీజేపీ న్యాయం చేస్తుందనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని, ప్రజల మనోభావాలను గుర్తించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కొన్ని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చినప్పుడు తమకెందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. తాము ఎక్కడా రాజీపడటం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిశామన్నారు.
కేంద్రం ముందుకు రావాలి
ప్రత్యేక హోదాకు సంబంధించిన రాయితీలు ఇవ్వాలని ముందునుంచి అడుగుతున్నామని, ఎక్కడా మాట మార్చలేదని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా.. దెబ్బతిన్న ఏపీ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని ఆరోపించారు.
ఎదురుదాడి చేస్తే ఊరుకోం
బీజేపీలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘హామీలు నెరవేరిస్తే గౌరవిస్తాం.. తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం. మాపై నిందలు వేయడం సరికాదు. మీరు ఢిల్లీ వెళ్లి హోదా సాధించేందుకు ప్రయత్నించండి అంతేకాని మాపై ఎదురుదాడి చేస్తే సహించే ప్రసక్తే లేద’ని బీజేపీ నాయకులను హెచ్చరించారు.
లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం ఆరోపించారు. రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నిసార్లు అడిగినా రైల్వేజోన్ ఇవ్వట్లేదని, షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనకు కేంద్రం చొరవ చూపడం లేదని వాపోయారు. అసెంబ్లీ సీట్లు పెంచాలన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సహకార స్ఫూర్తిని కోరుకుంటున్నానని.. కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహరించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment