మనం మన జీవితకాలంలో ఎవరి గురించి అయితే ఆలోచించకూడదని అనుకుంటామో వారి గురించిన ఆలోచనల్లోకి మనకు తెలియకుండానే వెళ్లిపోయామని గ్రహించినప్పుడు ఒక్కసారిగా ఎక్కడో దారి తప్పినట్లుగా అయిపోతాం. మనం తిన్నగానే ఉంటాం. దారీ తిన్నగానే ఉంటుంది. ఆగి చూస్తే.. మన ఆలోచనల్లో లేని ఆ వ్యక్తి దారి మధ్యలోకి వచ్చి తలకిందులుగా నిలబడి ఉంటాడు!
రేవంత్‌రెడ్డి గురించి ఆలోచించకూడదనే అనుకున్నాను. కానీ ఎంతటివాళ్లయినా ఆలోచన కోల్పోయి తన గురించి ఆలోచించేలా చేసుకుంటాడు అతడు! కాంగ్రెస్ డీఎన్‌ఏ అది. దారి వెంట మనిషిని ఊరికే పోనివ్వదు కాంగ్రెస్. ఆపుతుంది. ఆగకుండా పోతుంటే పిలుస్తుంది. పిలుస్తున్నా వినిపించుకోకుంటే.. ‘ఒక చట్టం తెచ్చారు తెలుసా? అంటుంది. అయినా పట్టించుకోకుండా వెళుతుంటే.. ‘ఆ చట్టాన్ని నీ కోసమే తెచ్చారు’ అంటుంది.
‘నీ కోసం’ అనే మాట వినగానే ఆ మనిషి ఆగిపోతాడు. ‘నీ కోసం’ అన్న దగ్గరే ఆగిపోతాడు. అప్పుడు రేవంత్‌రెడ్డిని అక్కడికి పంపుతుంది కాంగ్రెస్. ‘నీ కోసం’ అంటే ఏంటో ఆ మనిషికి వివరంగా చెప్పి రమ్మని పంపుతుంది.
చట్టంలో ఏముందో ఆ మనిషికి చెప్పడు రేవంత్‌రెడ్డి. చట్టంలో ఏముందని చెప్పడానికి కాంగ్రెస్ తనను పంపిందో అది చెప్తాడు.
‘‘రేవంత్‌రెడ్డి ఇక్కడ దారి కాచి అందర్నీ అటకాయిస్తున్నాడు సార్..’’ అని హైద్రాబాద్ నుంచి మళ్లీ ఫోన్!!
‘‘అటకాయించి ఏం చేస్తున్నాడు?’’ అని అడిగాను.
‘‘పాకిస్తాన్‌లో పుట్టిన ఒక వ్యక్తి ఐఎస్‌ఐ లో ట్రైనింగ్ తీసుకుని హిందువుగానో లేక సిక్కుగానో మారువేషంలో ఇండియా వచ్చి, ఇండియా పౌరసత్వం తీసుకుని, రాజకీయాల్లో చేరి, ఎంపీ అయి, ఐఎస్‌ఐ ఇచ్చిన లక్ష కోట్లతోనో, రెండు లక్షల కోట్లతోనో ఎంపీలందర్నీ కొనేసి, ప్రధాన మంత్రి అయిపోయి, ప్రధాని అయ్యాక జమ్మూకశ్మీర్‌ను పాకిస్తాన్‌కు, పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాదేశ్‌కు ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటని అందర్నీ ఆపి ఆపి అడుగుతున్నాడు సార్’’ అన్నాడు ఆ ఫోన్ చేసిన మనిషి.
‘‘నువ్వెవరు?’’ అన్నాను.
‘‘నేను ఈ దేశ పౌరుడిని సార్. భారతీయుడిని. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయి. డాక్యుమెంట్లు ఉన్నా కూడా వాటిని పరపర చింపి నోట్లో వేసుకుని.. ‘వేర్ ఆర్ యువర్ డాక్యుమెంట్స్’ అని ఢిల్లీ వాళ్లొచ్చి ఇంగ్లిష్‌లో అడుగుతారని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు సార్’’ అన్నాడు!
‘‘ఆర్ అండ్ బీ వాళ్లకు చెప్పకపోయావా?’’ అన్నాను.
‘‘ఎందుకు సార్?’’ అన్నాడు.
‘‘ఇలాంటి వాళ్లందరూ రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తారు. వాళ్లకోమాట చెబితే దారి మధ్యలో అడ్డంగా ఉన్నవాటిని క్రేన్‌లతోనో, బుల్‌డోజర్‌లతోనో తొలగించి దారిని క్లియర్ చేస్తారు’’ అని చెప్పాను.
‘‘థ్యాంక్యూ సార్’’ అన్నాడు.
‘సరే’ అని ఫోన్ పెట్టేయబోతుంటే మళ్లీ ‘‘సార్..’’ అన్నాడు.
‘‘చెప్పు’’ అన్నాను.
‘‘సార్.. నేను నా దేశంలోనే ఉంటాను కదా సార్’’ అన్నాడు!
‘‘మనం మన దేశంలోనే ఉంటాం. మన దేశంలోకి వచ్చినవాళ్లు మన దేశంలోనే ఉంటారు. మన దేశంలోకి రాబోతున్నవాళ్లూ మన దేశంలోనే ఉంటారు. సరేనా’’ అన్నాను.
‘‘మరి చట్టం ఎందుకు సార్?’’ అన్నాడు!
రేవంత్‌రెడ్డి ఏ లెవల్లో అటకాయిస్తున్నాడో అర్థమైంది.
‘‘లేనివాళ్లకు ఇవ్వడానికి చట్టం గానీ, ఉన్నవాళ్ల నుంచి తీసుకోడానికి కాదయ్యా. నిశ్చింతగా ఉండు’’ అని చెప్పాను.
-మాధవ్ శింగరాజు
జి. కిషన్ రెడ్డి (కేంద్ర మంత్రి) రాయని డైరీ
Published Sun, Dec 22 2019 1:23 AM | Last Updated on Sun, Dec 22 2019 1:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment