Munugode By-Poll 2022: Minister KTR Comments On Munugode Bypoll And Assembly Elections - Sakshi
Sakshi News home page

మునుగోడులోనే కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే: కేటీఆర్‌

Published Thu, Oct 20 2022 2:12 AM | Last Updated on Thu, Oct 20 2022 10:40 AM

Minister KTR Comments on Munugode Bypoll and Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికతోపాటు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సహా వివిధ రంగాలకు చెందిన పదివేల మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టులు, డబ్బు సంపాదన కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని విమర్శించారు. 

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.40 లక్షల మంది ఓటర్లు ఉంటే 99 శాతం అంటే 2.38 లక్షల మందికి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి జరిగిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మునుగోడులో ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని.. తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ’మునుగోడు’ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలివీ..

సాక్షి: మునుగోడులో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మోహరించడంపై వస్తున్న విమర్శలపై స్పందన? 
కేటీఆర్‌: 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు ప్రధాని మోదీ ఐదు నెలల్లో 16 సార్లు వెళ్లారు. కేంద్ర మంత్రులను మోహరిస్తున్నారు. సొంత రాష్ట్రంలో మోదీకి పలుకుబడి తగ్గిందా? మంత్రులు సహా మునుగోడు ప్రచారంలో ఉన్న వారంతా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే. పార్టీ గెలిస్తేనే మా­కు మనుగడ. విపక్షాలు తాము చేయనిది కూడా చేసినట్టు ప్రచారం చేస్తున్నాయి. మేం చేసి­న పనులను చెప్పేందుకే గడప గడపకూ వెళ్తున్నాం. 

రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులనే ఆరోపణలేమిటి? 
గతంలో నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌లలో ఉప ఎన్నికకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి మూడేళ్లుగా బేరసారాలు చేసుకుని, బేరం కుదిరాక రాజీనామా చేశారు. రాజగోపాల్‌రెడ్డికి చెందిన చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలు ఎవరు?, ఎవరి వాటా ఎంత? దీని వెనుక ఉన్న గుజరాత్‌ రహస్యమేంటో ప్రజలకు చెప్పాలి. 

కోమటిరెడ్డి బ్రదర్స్‌ కోవర్టులు అనడం సరైనదేనా? 
కోమటిరెడ్డి సోదరులు కోవర్టు బ్రదర్స్‌ అనే విమర్శకు వంద శాతం కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఒక పార్టీ నుంచి గెలిచి మూడేళ్లుగా మరోపార్టీకి వత్తాసు పలకడం అందరూ గమనించారు. 

మునుగోడులో నాయకుల కొనుగోళ్లు, పార్టీలు మారడంపై మీరేమంటారు? 
రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై చర్చ జరుగుతోంది. దీనికి ఒక పార్టీ లేదా నాయకుడు కారణం కాదు. మునుగోడు ఎన్నికల్లో పంచేందుకు మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆదేశాల మేరకు బండి సంజయ్‌ అనుచరుడు చొప్పరి వేణు కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడ్డాడు. పార్టీలు, నాయకుల స్వీయ నియంత్రణతోనే ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గుతుంది. 

బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందన్న ఆరోపణలపై మీ స్పందన? 
సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీలు మొదలుకుని దేశంలో దాదాపు పదివేల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారులు, జర్నలిస్టుల వరకు అందరి ఫోన్లను మోదీ ప్రభుత్వం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో ట్యాప్‌ చేస్తోందనేది బహిరంగ రహస్యం. ప్రైవేటు సంభాషణల్లో జడ్జీలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. 

ఈ ఉప ఎన్నిక దెయ్యాలు, దేవుళ్లకు మధ్య ఎన్నికలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందన? 
యాదాద్రి దేవాలయాన్ని నిర్మించినది సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలోని గుడులకు నయా పైసా ఇవ్వనిది మోదీ ప్రభుత్వం. దేవుళ్లు ఎవరో, దెయ్యాలెవరో ప్రజలే నిర్ణయిస్తారు. 

సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ఉండి పాలన పడకేసిందనే ఆరోపణలు వస్తున్నాయేం? 
ఎవరు ఎక్కడ ఉన్నా పనులు ఆగడం లేదు. నేను, ఆర్థిక మంత్రి హరీశ్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి రోజూ చేస్తున్న సమీక్షలు, పాల్గొంటున్న కార్యక్రమాలే నిదర్శనం.

టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు, పార్టీని వీడుతున్నవారిపై కామెంట్‌? 
పార్టీలో అసంతృప్తి లేదు. కారు ఓవర్‌ లోడ్‌ అయింది. వాళ్ల గాచారం బాగోలేక కొందరు బయటికి పోతున్నారు. బయటికి పోయినోళ్ల పరిస్థితి చూశాం. బీజేపీ ఏం చేసిందో బూర నర్సయ్యగౌడ్‌ చెప్పాలి. ఆయన మా సోదరుడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటం. 

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రభావం ఎలా ఉంటుంది? 
రాష్ట్రంలో రాహుల్‌ యాత్ర సమయంలోనే కాంగ్రెస్‌ ఎంపీలు ఒకరిద్దరు ఇతర పార్టీల్లోకి వెళతారు. ఆయన నడుస్తుంటే కాంగ్రెస్‌ కకావికలమై పోతోంది. రాహుల్‌ చేయాల్సింది భారత్‌ జోడో కాదు.. కాంగ్రెస్‌ జోడో యాత్ర. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉంది. రాహుల్‌ సొంత పార్టీనే కాపాడుకునే స్థితిలో లేరు. 76 ఏళ్ల సోనియా నుంచి ఏఐసీసీ బాధ్యతలు తీసుకుని 80 ఏళ్ల ఖర్గేకు అప్పగిస్తున్నారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నా రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ఆ రాష్ట్రాన్ని టచ్‌ చేయకుండా వెళుతోంది. బీజేపీ, మోదీతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం ఉందా చెప్పాలి. 

కారును పోలిన గుర్తులపై మీ అభ్యంతరమేంటి? 
కారును పోలిన గుర్తులతో గతంలో భువనగిరి లోక్‌సభ స్థానంలో, దుబ్బాక ఉప ఎన్నికలో మా పార్టీ అభ్యర్థులు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటరు తీర్పును ఇలాంటి గుర్తులు ప్రభావితం చేస్తాయి. అందుకే రాజకీయ పార్టీగా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? 
ఇది చాలా పెద్ద అంశం. రాష్ట్రం అవసరాలకు సరిపోయేంత ఆదాయం ఉంది. దీనిపై అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. 

మునుగోడును దత్తత తీసుకుంటున్నారా? 
రాజగోపాల్‌రెడ్డి నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని అనాథ చేశారు. అందుకే నేను దత్తత తీసుకుంటానని ప్రకటించా. మునుగోడులో కొత్త అభివృద్ధి నమూనా ఆవిష్కరించే బాధ్యత నాదే. ముంచే వాడు కావాలా.. ముందుకు తీసుకెళ్లేవాడు కావాలా.. ప్రజలు తేల్చుకుంటారు. 

మునుగోడులో టీఆర్‌ఎస్‌ ప్రచార సరళి ఎలా ఉంది? 
మునుగోడులో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలుస్తుంది. నల్లగొండను పీడించిన ఫ్లోరోసిస్‌ మహమ్మారిని రూపుమాపాం. పాలమూరు–రంగారెడ్డిని జతచేసి కృష్ణా జలాలను మునుగోడుకు అందించే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 2016లో మునుగోడు వచ్చిన నాటి కేంద్రమంత్రి నడ్డా ఫ్లోరోసిస్‌ సమస్య పరిష్కారం కోసం 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామ న్నారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ఇచ్చేది రూ.3వేల పెన్షన్‌కాదు.. ఓటుకు రూ.3వేలు లేదా రూ.30వేలు ఇస్తారేమో? 

మోదీ తెలంగాణపై పగబట్టినట్టున్నారు! 
కృష్ణా జలాల్లో నీటి వాటాను తేల్చకుండా మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కాలయాపన చేస్తోంది. దీనితో తెలంగాణతోపాటు ఆంధ్రాకు అన్యాయం జరుగుతోంది. కేంద్రం పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా వివక్ష చూపుతూ అనవసర అవాంతరాలు సృష్టిస్తోంది. కొత్తగా కాళేశ్వరం డీపీఆర్‌ను స్టడీ చేస్తారట. అమ్మ పెట్టదు. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఉంది. తెలంగాణపై మోదీ వివక్ష చూపుతున్నారు. శత్రుదేశం మీద పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. 

తప్పుచేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం 
లిక్కర్‌ స్కామ్, ఇంకో స్కామ్‌ అని కాదు.. ఏదైనా సరే విచారణ జరిపి నిరూపిస్తే వద్దనడం లేదు. తప్పుచేస్తే ప్రజల ముందు పెట్టండి. బీజేపీ నేతలంతా హరిశ్చంద్రుడి సోదరులు అనేలా ఉంది మోదీ వైఖరి. ఆ పార్టీ నేతల మీద ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరగవు? మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లపై కేసులు ఏమయ్యాయి? ఎన్నికల సంఘం కూడా బీజేపీ జేబు సంస్థగా మారింది. గుజరాత్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు. నీతులు ఇతరులకేనా?.

మునుగోడు ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? 
మునుగోడులో గెలుస్తాం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరాబర్‌ గెలుస్తాం. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు ఎన్నికై హ్యాట్రిక్‌ కొట్టిన సీఎం ఎవరూ లేరు. 2023లో కేసీఆర్‌ మూడోసారి సీఎం అయి చరిత్ర సృష్టిస్తారు. దక్షిణాదిలో ఎన్టీఆర్, కరుణానిధి, నంబూద్రిపాద్, రామకృష్ణ హెగ్గే, చంద్రబాబు వంటి ఉద్ధండులకు సాధ్యంకాని హ్యాట్రిక్‌ను కేసీఆర్‌ సాధిస్తారు. ఒకప్పుడు వైఎస్‌ వంటి పెద్దస్థాయి నేతలతో కేసీఆర్‌ కొట్లాడారు. రేవంత్, బండి సంజయ్‌ వంటివారు బఫూన్లు. వాళ్లు కేసీఆర్‌ కాలిగోటికి కూడా సరిపోరు. ఎవరి సత్తా ఏమిటో వచ్చే నెల ఆరున తేలిపోతుంది. ఈ ఉప ఎన్నిక ప్రభుత్వాలను మార్చేందుకు వచ్చినదికాదు. ఒక వ్యక్తి స్వార్థంతో ప్రజల మీద రుద్దబడింది. కాంట్రాక్టర్‌ అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య ఎన్నిక.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement