సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదని..
కే అంటే కాలువలు..
సీ అంటే చెరువులు..
ఆర్ అంటే రిజర్వాయర్లు
అనేది రాష్ట్రంలోని లక్షలాది రైతుల మాట అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ‘ఇన్‌క్రెడిబుల్ తెలంగాణ’ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతమైన సంస్కరణలను అమల్లోకి తెచ్చా రని ప్రశంసించారు. అసలు మీకు పరిపాలన చేతనవుతుందా అని ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నిం చిన గొంతులే.. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన, సంస్కరణలను ప్రశంసిస్తున్నాయని పేర్కొ న్నారు. సోమవారం జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో ‘రాష్ట్రంలో పాలనా సంస్కరణలు– విద్యుత్– ఐటీ– పారిశ్రామిక అభివృద్ధి’పై కేటీ ఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
అద్భుత విజయాలు సాధిస్తున్నాం
‘‘ఉమ్మడి ఏపీలో నీటి వనరులంటేనే చిన్న చూపు చూసే పరిస్థితి. బడ్జెట్‌లో కేటాయిం పులు అంతంతే. చిన్ననీటి వనరులకు కేసీఆర్ పెద్దపీట వేశారు. చిన్న, పెద్ద నీటివనరులు అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలను కాల్వలు, చెరువులు, చెక్‌డ్యాంలు, ఆనకట్టలు, లిఫ్ట్ స్కీమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. సంస్కరణ లంటే అతుకుల బొంతలు కాదు. అలాంటి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కేలా చేసిన ఘనత కేసీఆర్‌దే.
ప్రతీ సంస్కరణకు కేంద్ర బిందువు ప్రజలే. అందుకే ఈ అద్భుత విజయాలు, అసాధారణ ఫలితాలు సాధి స్తున్నాం. సమైక్య రాష్ట్రంలో కరెంట్ అంటేనే సంక్షోభం, అది నేడు తెలంగాణలో సంతో షంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిన తెలంగాణ ఉద్యమంలో.. యువతరం ముందుండి పోరాడింది. వారి ప్రయోజనాలే పరమావధిగా కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటైంది. తద్వారా 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే వీలు ఏర్పడింది.
ఇది సంస్కరణలకే స్వర్ణ యుగం
ఒకే సమయంలో సంక్షేమ, సంస్కరణల ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఈ ఏడున్నరేళ్ల పాలన పాలన సంస్కరణలకే స్వర్ణయుగం. అధికార వికేంద్రీకరణతో 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సంఖ్యను పెంచి స్వయం పరిపాలన అందించాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చాక అమల్లోకి వచ్చిన సంస్కరణలతో, పల్లెప్రగతి కార్య క్రమంతో రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శపల్లెగా రూపుదిద్దుకుంటోంది. కేంద్రం సైతం దీనిని గుర్తించి అవార్డుల మీద అవార్డులు ఇస్తోంది. మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టం ద్వారా కేసీఆర్ కడిగిపారేశారు.
రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆచరణాత్మకంగా నిరూపించింది. దేశంలో ఏ రాష్ట్రం తలపెట్టని భూరికార్డుల ప్రక్షాళన ఇక్కడ చేపట్టాం. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. ధరణి పోర్టల్ సంస్కరణల శకంలోనే ఒక సంచలనం. ఇది భూమిచుట్టూ అల్లుకున్న చిక్కుముడులను విప్పేసింది. ఇప్పుడు స్పష్టమైన హద్దులతో సమగ్ర భూరికార్డులను నిర్ధారించి పాస్ పుస్తకాలు అందించనున్నాం. ఇకపై భూరికా ర్డులను ట్యాంపర్ చేసే అవకాశం లేదు.
కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంస్కరణల పర్వంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వివిధ సంద ర్భాల్లో దేశంలోని ప్రముఖులను కలిసినపుడు వారంతా అంటున్నది ఒకటే మాట. ఒకప్పుడు ‘నేడు బెంగాల్ ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుంది’ అన్న నానుడి ఉండేది. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని ‘తెలంగాణలో నేడు ఏం జరుగుతుందో, రేపు యావత్ భారత్‌లో జరుగుతుంది’ అనే విధంగా ప్రశంసలు అందు తున్నాయి.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘ఇన్‌క్రెడిబుల్ తెలంగాణ..’లక్ష్యం
రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళుతోంది. ఐటీ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదు.. ‘ఇన్‌క్రెడిబుల్ తెలంగాణ’అనే మాదిరిగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. కఠోర పరిశ్రమతో, అవినీతి రహిత క్లియరెన్సులకు మార్గం కల్పిస్తూ, రెడ్ కార్పెట్ స్వాగతం చెప్తే తప్ప ఆషామాషీగా పెట్టుబడులు రావు.
కేసీఆర్ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. అది పూర్తయ్యాక కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక కారిడార్లు, పార్కులు, క్లస్టర్లతో భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు బహుముఖ ప్రయోజనాలు సమకూరుతాయి. రాష్ట్రంలో స్టార్టప్‌లకు పెద్దపీట వేసి, కొత్త పరిశ్రమలకు ప్రాణం పోస్తుంటే.. కేంద్రంలో మాత్రం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉసురుతీసి ఉద్యోగాలు ఊడగొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment