నాడు ఆగమాగం.. నేడు బంగారం: టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ | Trs Party 20 Years Plenary Function On October 25 Highlights | Sakshi
Sakshi News home page

నాడు ఆగమాగం.. నేడు బంగారం: టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌

Published Mon, Oct 25 2021 7:53 AM | Last Updated on Tue, Oct 26 2021 2:23 PM

Trs Party 20 Years Plenary Function On October 25 Highlights - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఒకనాడు ఆగమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగం, వరి ధాన్యం ఉత్పత్తి.. ఇలా ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23లక్షల కోట్లు ఖర్చు పెడతాం. ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందులో భాగంగా అట్టడుగున ఉన్న దళితుల కోసం మొదట దళితబంధు కార్యక్రమం చేపట్టాం.

ఈ పథకాన్ని వందశాతం అమలు చేసి తీరుతాం. కేవలం దళితబంధుతోనే ఆగిపోబోం. వారితోపాటు గిరిజనులు, బీసీ, ఎంబీసీ, రెడ్డి, బ్రాహ్మణ, వెలమ మొదలైన అన్నివర్గాల పేదలకు మేలు చేస్తాం..’’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మార్చినాటికి ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు అందిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

అనంతరం కేసీఆర్‌ మాట్లాడారు. ఉద్యమకాలం నుంచీ ఎదుర్కొన్న ఆటుపోట్లను, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన వివరించారు. కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

దళితబంధుతో సంపద సృష్టి 
దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు. రాష్ట్రంలోని 17లక్షలకుపైగా కుటుంబాలకు దళితబంధు సాయంతో రూ.1.70 లక్షల కోట్లు పెట్టుబడిగా పెడితే రూ.10 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతుంది. దళితబంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటు అందిస్తుంది. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టు కింద నవంబర్‌ 4 తర్వాత పూర్తి స్థాయిలో అమలవుతుంది. దానితోపాటు రాష్ట్రం నలుదిక్కులా నాలుగు మండలాల్లోనూ అమలు చేస్తున్నాం.

తర్వాత అన్ని నియోజకవర్గాల్లో 100 కుటుంబాల చొప్పున పథకాన్ని అమలు చేస్తాం. ఇది 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొనే స్కీం కాదు. ఆ 10 లక్షలతో ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. ముగ్గురు కలిసి 30 లక్షలతో ఒకే వ్యాపారం చేసుకోవచ్చు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే వైన్‌షాపులు, మెడికల్, ఫెర్టిలైజర్‌ షాపులతో పాటు కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్‌ ఇస్తాం. దళితులకు ఏ ఆపద వచ్చినా కాపాడేలా రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. 

వారు ఢిల్లీకి గులాములు 
కాంగ్రెస్, బీజేపీలతో దళితబంధు వంటి పథకం సాధ్యమవుతుందా? వాళ్లకు ఢిల్లీ పర్మిషన్‌ ఇస్తదా? కిరికిరిగాళ్లు, కిరాయిగాళ్లు, ఢిల్లీ గులాములు దీన్ని చేయలేరు. ఈ గులాములు అధికారంలోకి వస్తే.. హైకమాండ్‌ సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌.. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది కాబట్టే ఈ పథకం వచ్చింది. టీఆర్‌ఎస్‌కు హైకమాండ్‌ లేదు. శాసించేవాళ్లు లేరు. ప్రజలే అధిష్టానం. వారే దిశానిర్దేశం చేస్తరు. మన సంపదను మనమే ఖర్చు చేసుకుంటాం. ఎవరికి భయపడం. అందుకే దళితబంధు వంటి గొప్ప పథకాన్ని తీసుకురాగలిగాం. 

స్వాతంత్య్ర పోరాటంలా తెలంగాణ ఉద్యమం 
తెలంగాణ పోరాటాన్ని ఎందరో హేళన చేశారు. ఎక్కడి తెలంగాణ అన్నరు. క్యాదుకాన్‌ లగాయా భాయ్‌ అన్నరు. 20 ఏళ్ల కింద జలదృశ్యంలో గులాబీ పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు విపరీతమైన అపనమ్మక, అగమ్య గోచర పరిస్థితి. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సిపాయిల తిరుగుబాటు విఫలమైనా, జలియన్‌ వాలా భాగ్‌ వంటి మారణకాండలు సాగినా ఆగకుండా స్వాతంత్య్రం సాధించుకున్నట్టుగానే.. తెలంగాణ ఉద్యమం సాగించి విజయతీరాలకు చేరాం.

గాంధేయ మార్గంలో సాగిన తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త బాటను చూపింది. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఇప్పటికీ చేతకాని, చేవలేని కొందరు అదెట్లా, ఇదెట్లా అని మాట్లాడుతున్నారు. రైతుబంధు పెట్టిననాడు కూడా ఇలాగే విమర్శలు చేశారు. ఇప్పుడు రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమైంది. దళితబంధు కూడా గొప్ప కార్యక్రమంగా మారుతది. తెలంగాణ వస్తే చీకటి అయిపోతదని శాపనార్థాలు పెట్టిన్రు. మనం 24 గంటల కరెంటు ఇస్తున్నం. 

అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు 
రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కేసులు, యాదాద్రి కడతామంటే కేసులు, సచివాలయ నిర్మాణం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అన్నింటి మీదా కేసులే. వాటన్నింటినీ ఛేదించుకొని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాం. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం. అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది.

మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.35 లక్షలకు పెరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో మనమే టాప్‌. తలసరి ఆదాయంలో కూడా దేశంలోని మొదటి రెండు స్థానాల్లో ఉన్నాం. వరిసాగులో పంజాబ్‌ను దాటేశాం. నేడు 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంటే.. అంత పంటను మేం కొనలేమని ఎఫ్‌సీఐ చేతులెత్తేస్తోంది.

ప్రజల మేలు కోసం సాహసోపేత నిర్ణయాలు 
ఏవైనా పనులు చేయాలంటే, కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే సాహసం కావాలి. నాడు పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ తీసేసినట్లే.. ఇప్పుడు ప్రజలకు భారంగా మారిన వీఆర్వో వ్యవస్ధను రద్ధు చేశాం. ధరణిని తీసుకొచ్చాం. ఐదు నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ధరణిలో పేరు నమోదైతే.. తీసేసే హక్కు ఎవరికీ ఉండదు.

నాందేడ్, రాయచూర్‌లను తెలంగాణలో కలపాలంటున్నరు 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నాయని, వాటిని తమవద్దా అమలు చేయాలని, లేదంటే తెలంగాణలో కలపాలని నాందేడ్, రాయచూర్‌ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. రాయచూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అయితే బహిరంగంగానే ఈ డిమాండ్‌ చేశారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడిస్తోంది. ఆంధ్రాలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. 

ఎన్నికల సంఘం చిల్లర రాజకీయాలు 
కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి ప్రవర్తిస్తోంది. దేశంలో ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నా.. భారత ఎన్నికల సంఘం చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్న. కేసీఆర్‌ సభ పెట్టొద్దా? ఏం కత? ఇదో పద్ధతా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఎన్నికలప్పుడు సీఎం సభ పెట్టొద్దంటూ కొందరు హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించొద్దని ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా హుజూరాబాద్‌ దళితులు అదృష్టవంతులు. ఎన్నికల సంఘం ఏం చేసినా నవంబర్‌ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలిచి, దళిత బంధును ముందుకు తీసుకెళ్తడు. 

అనాథ ఆడపిల్లల కోసం రాత్రంతా ఏడ్చిన.. 
ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ ఆవేదనకు గురయ్యారు. ‘‘గతంలో నేను ఓ సమావేశానికి వెళ్లినప్పుడు ఇద్దరు బాలికలు నా వద్దకు వచ్చారు. మేం అనాథ పిల్లలం. కేజీబీవీలో చదువుతున్నం. టెన్త్‌ అయిపోతుంది. తర్వాత మేం ఎక్కడికి పోవాలో తెలుస్తలేదన్నరు. వారికి తల్లిదండ్రులు లేరు. ఆదరించే బంధువులు లేరు. ఇది క్రూరమైన సమాజం. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలె. ఏం చేయాలె. ఆ రోజు నిద్ర పోలేదు. మనసులో బాగా ఏడ్చిన.

నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి వస్తే.. మనం ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించిన. ఈ క్రమంలోనే అనాథ పిల్లల కోసం త్వరలో మంచి కార్యాచరణ ప్రకటించినం. కేజీబీవీలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేశాం. హాస్టళ్లను పెంచుతున్నాం. అనాథ పిల్లలు స్టేట్‌ చిల్డ్రన్‌ కింద ఉండాలి. అనాథ బిడ్డలు కనిపిస్తే చేరదీసి, కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సిన అవసరం ఉంది’’ అని కేసీఆర్‌ తెలిపారు.

2028లో మన బడ్జెట్‌ రూ.4.28 లక్షల కోట్లు 
వచ్చే ఏడేళ్లలో రాష్ట్రంలో 23లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నం. 2028 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 4.28 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం రూ.2.28 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2028 నాటికి 7.76 లక్షలకు చేరుతుంది. 

తలమాసినోళ్లు బెదిరిస్తే బెదరం.. 
ఎవరో హరాకిరి గాళ్లు, తలమాసిన వెధవలు, పనికిమాలిన వాళ్లు అవగాహన రాహిత్యంతో, తెలివి తక్కువతనంతో అడ్డంపొడుగు మాట్లాడితే.. టీఆర్‌ఎస్‌ పార్టీ బెదిరిపోదు. 60లక్షల సభ్యులు కలిగిన పార్టీ టీఆర్‌ఎస్‌. సభ్యుల బీమాకే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నం. తాను గెలిచి నిలవడమే కాదు, గెలిపించిన సమాజం తలకెత్తుకొని తిరిగేలా అండగా నిలిచిన పార్టీ టీఆర్‌ఎస్‌. కుక్కలను, మేకలను ఎక్కడ కట్టేయాలో ప్రజలే నిర్ణయిస్తరు.

టీఆర్‌ఎస్‌ వద్ద రూ.425 కోట్లు 
టీఆర్‌ఎస్‌ ఆర్థికంగా కూడా శక్తివంతంగా తయారైంది. దేశంలోని ముఖ్యమైన పార్టీలతోపాటు టీఆర్‌ఎస్‌కు కూడా గణనీయంగా విరాళాలు సమకూరాయి. రూ.425 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై వడ్డీ రూపంలో నెలకు రూ.2 కోట్లు వస్తుంది. ఆ డబ్బులతోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం. 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందాం.  

కత్తి పట్టిన కేసీఆర్‌..
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించాక.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ అభిమానులు ఇచ్చిన కరవాలాన్ని పైకెత్తారు. ఒక్కసారిగా పార్టీ నేతలు, కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేశారు. 


ఎటు చూసినా గులాబీనే..
ప్లీనరీ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. ప్లీనరీకి వెళ్లే దారులు అయితే మొత్తం గులాబీమయం అయిపోయాయి. సభలో కూడా గులాబీ చీరలు ధరించిన పార్టీ మహిళా ప్రతినిధులు, గులాబీ చొక్కాలు, పార్టీ కండువాలు ధరించిన నేతలు, కార్యకర్తలతో హెచ్‌ఐసీసీ ప్రాంగణం గులాబీ వనంలా కనిపించింది.

సెల్ఫీ టైమ్‌..
కేసీఆర్, కేటీఆర్‌ల దృష్టిలో పడేందుకు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సభావేదిక సమీపంలో సందడి చేశారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఎమ్మెల్యేలు, మంత్రులతో సెల్ఫీలు దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement