సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్తనేతలను చేర్చుకునేందుకు ఒకవైపు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలు.., మరోవైపు కొందరు నేతలు వరుసగా పార్టీని వీడటం కమలదళం నాయకుల్లో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు లభించడం లేదనే భావనతో ఉన్న నాయకులను టీఆర్‌ఎస్ టార్గెట్ చేస్తున్నట్లు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొందరు అసంతృప్త నేతలు అధికార పార్టీలో చేరొచ్చన్న ప్రచారంతో బీజేపీ నాయకులు అప్రత్తమయ్యారు. తాజాగా దాసోజు శ్రవణ్, కె.స్వామిగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరగా మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడవచ్చని ప్రచారం సాగుతోంది. తమ పార్టీకి చెందిన వివిధస్థాయిల నాయకులకు టీఆర్‌ఎస్ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయన్న సమాచారంతో జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.
మునుగోడు పోలింగ్‌కు ఇంకా 12 రోజులు ఉండటంతో వలసల రూపంలో పార్టీకి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మునుగోడులో బీసీవర్గాల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ నాయకత్వం పావులు కదుపుతోందనే అంచనాకు పార్టీనాయకులు వచ్చారు.
బూర నర్సయ్య చేరికతోనే ..
టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను బీజేపీలోకి చేర్చుకోగానే తమ పార్టీలోని ఈ వర్గంతో పాటు ఇతర బీసీ వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ ప్రయత్నాలు సాగించడం కమలం నేతలను ఉలికిపాటుకు గురిచేసింది. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ తమ పార్టీ నాయకులను వివిధ రూపాల్లో ప్రలోభపెడుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలల కిందటే తమ పార్టీలో చేరిన మాజీ టీఆర్‌ఎస్‌నేత కోవర్ట్‌గా పనిచేశారన్న విషయం ఇప్పుడు స్పష్టమైందని బీజేపీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో అన్నారు.
ఇటీవల స్టీరింగ్ కమిటీ సమావేశంలోనూ పాల్గొన్న ఆ నేత, బీజేపీ మునుగోడు వ్యూహాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారని, ఇదంతా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలకు అనుగుణంగానే జరిగిందని ఆ నాయకుడు వెల్లడించారు. గతంలో టీఆర్‌ఎస్‌లో ఉన్న ఓనేత తనపై ఉన్న కేసుల కారణంగానే మళ్లీ అధికార పార్టీలోకి వెళుతున్నట్టు చెప్పారని ఆ నాయకుడు పేర్కొన్నారు. కేసుల నుంచి విముక్తి కల్పిస్తారనే హామీ నేపథ్యంలోనే ఆ నేత, పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్నారు. కాగా, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు బీజేపీలో సముచితస్థానమే లభించిందని గుర్తు చేశారు. వ్యక్తిగత ప్రయోజనం కోసమో, రాజకీయ లబ్ధికోసమో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే నాయకులను ఏమనగలమని మరో బీజేపీ నాయకుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment