సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చండూరు: మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డురోలర్ గుర్తును మార్చి మరో గుర్తును కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. ఆర్వో తనకు లేని అధికారాలను వినియోగించారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. జగన్నాథరావును ఎన్నికల విధుల నుంచి తప్పించి.. రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు అప్పగించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది.
ఏం జరిగింది?
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా ఎన్నికలో తొలుత గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ ద్వారా గుర్తులను కేటాయిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఇచ్చిన ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం చివరిగా 2021 సెప్టెంబర్ 23న ‘ఫ్రీసింబల్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 17న జనరల్ అబ్జర్వర్ సమక్షంలో లాటరీ ద్వారా యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌కు రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు చండూరులోని ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. టీఆర్‌ఎస్ గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్‌ను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాయి.
నల్లగొండలోని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నివాసం ఎదుట కూడా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మరోవైపు 18న విడుదల చేసిన గుర్తుల కేటాయింపు జాబితాలో రోడ్డురోలర్ గుర్తు మాయమైంది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు.. రోడ్డురోలర్ గుర్తును మార్చి కొత్తగా బేబీ వాకర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించారు. అదికూడా జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లకుండా/ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చే ముందు అభ్యర్థికి ఎలాంటి నోటీసు/సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ పత్రాల్లో శివకుమార్ ఇచ్చిన ప్రాథమ్యాల్లో బేబీ వాకర్ గుర్తు లేదు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తును మార్చిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ.. జనరల్ అబ్జర్వర్ ఈ నెల 18న లేఖ రాశారు. శివకుమార్ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక తెప్పించుకుంది.
సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం
‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్, 1961లోని నిబంధన 10(5)’ను ప్రయోగిస్తూ ఆర్వో జగన్నాథరావు ఎన్నికల గుర్తు మార్పు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఒకసారి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను మార్చే అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాలను వినియోగించి ఎన్నికల గుర్తు మార్చడానికి దారితీసిన పరిస్థితులపై సంజాయిషీ ఇవ్వాలని జగన్నాథరావును ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు జగన్నాథరావు పంపిన సంజాయిషీని సీఈవో కార్యాలయం గురువారం రాత్రి సీల్డ్ కవర్‌లో ఈసీకి పంపింది. మారిన గుర్తులతో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
సీఈవో కార్యాలయాన్నీ సంప్రదించని తీరు
ఎన్నికల గుర్తు మార్పు విషయంలో ఆర్వో జగన్నాథరావు సీఈవో కార్యాలయాన్ని కూడా సంప్రదించలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఈసీ ఆదేశాల మేరకు జగన్నాథరావుపై చర్యలకు అవకాశముందని పేర్కొన్నాయి. అయితే ఓ పార్టీ ఒత్తిడితోనే జగన్నాథరావు ఎన్నికల గుర్తును మార్చారని ఈసీ నిర్ధారణకు వచ్చిందని.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసీ నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అయిన జగన్నాథరావును తప్పించి.. ఆ స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను నియమించింది. తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని జగన్నాథరావుకు సూచించింది.
గుర్తుల తొలగింపుపై టీఆర్‌ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈసీ
టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారును పోలిన ఎనిమిది ఎన్నికల చిహ్నాలు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కెమెరా, చపాతీ రోలర్, డోలీ (పల్లకి), రోడ్డురోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, పడవ గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని, ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ పేర్కొంది. అయితే టీఆర్‌ఎస్ చేసిన విజ్ఞప్తి సజావుగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్టు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై సీఈవో వికాస్‌రాజ్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
సీరియల్ నంబర్‌పైనా ఫిర్యాదు
ఇక బ్యాలెట్‌లో తమకు సీరియల్ నంబర్ కేటాయింపు విషయంలోనూ యుగతులసి పార్టీ రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాలెట్ పేపర్‌లో మొదట తమకు సీరియల్ నంబర్ 5ను కేటాయించినా.. తర్వాత 14వ నంబర్‌కు మార్చారని, దీనిని కూడా సరిదిద్దాలని కోరింది.
నాకు ఉన్న అధికారాలతోనే గుర్తును మార్చాం: జగన్నాథరావు
యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు తొలుత రోడ్డురోలర్ గుర్తు కేటాయించింది వాస్తవమేనని.. తర్వాత వచ్చిన వినతుల మేరకు తనకున్న అధికారంతో గుర్తును మార్చానని తొలగింపునకు గురైన రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు యుగతులసి పార్టీకి తిరిగి రోడ్డురోలర్ గుర్తును కేటాయించామన్నారు. యుగతులసి అభ్యర్థికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీరియల్ నంబర్ 14 వచ్చిందని, 5వ నంబర్ కాదని చెప్పారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అ«ధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment