Special Ground Report On Vikarabad District Politics, Details Inside - Sakshi
Sakshi News home page

ఆ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే‍లకు ఛాన్స్‌ దక్కేనా? ఓటర్ల నాడి ఎలా?

Published Thu, Sep 1 2022 7:57 AM | Last Updated on Thu, Sep 1 2022 12:48 PM

Vikarabad District Politics Special Ground Report - Sakshi

జిల్లాల విభజనలో తెలంగాణ ఊటీగా పేరున్న అనంత‌గిరి కొండ‌ల చుట్టూ విస్తరించిన వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాలో మూడు గ్రామీణ నియోజకవర్గాలే ఉన్నాయి. వికారాబాద్‌, పరిగి, తాండూరు సెగ్మెంట్లలో పాలిటిక్స్‌ఎలా ఉన్నాయో చూద్దాం. పార్టీలు పాతవారికే ఛాన్స్‌ఇస్తాయా? కొత్తవారికి అవకాశం కల్పిస్తాయా? అసలు ఓటర్ల నాడి ఎలా ఉంది? త్రిముఖపోటీలో ఎవరిది పైచేయి కాబోతోంది?

గత ఎన్నిక‌ల్లో ఇద్దరు మాజీ మంత్రుల‌ను ఢీకొని వికారాబాద్‌ నుంచి విజ‌యం సాధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు ప్రస్తుతం పార్టీలో వ‌ర్గపోరు త‌ల‌పోటుగా మారింది. దీంతో పార్టీలో సీనియ‌ర్లను ప‌క్కన‌పెట్టి.. సొంత క్యాడ‌ర్ నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే తీరుపై ర‌గిలిపోతున్న సీనియ‌ర్లు వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ నేత‌ను బరిలో దించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండే టీఎస్ఐఐసీ ఛైర్మన్‌ గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో పోటీ చేయించాల‌ని కొందరు స్థానిక నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై ప్లీన‌రీలో మాట్లాడి సీఎం కేసీఆర్ ద‌గ్గర ఆనంద్ మార్కులు కొట్టేశారు. వికారాబాద్ జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ సునీతారెడ్డిపై ఆనంద్ వ‌ర్గీయులు దాడి చేయ‌డం.. దాడి చేసిన కార్యక‌ర్తకు టీఆర్ఎస్ యూత్ వింగ్ మండ‌ల అధ్యక్షుడిని చేయ‌డం వివాదంగా మారింది. 

క్యాడర్‌ను కాపాడుకుంటూ ముందుకు
కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి గ‌డ్డం ప్రసాద్‌కుమార్‌కు లైన్ క్లియ‌ర్‌గా ఉంది. పార్టీ నుంచి చాలా మంది నాయకులు వెళ్ళిపోయినా వికారాబాద్‌లో క్యాడ‌ర్‌ను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రసాద్‌కుమార్‌. గ‌త ఎన్నిక‌ల్లో 3వేల ఓట్ల తేడాతోనే  ఓడిన ప్రసాద్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని గ‌ట్టిప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

బీజేపీకి వేవ్‌ కలిసొచ్చేనా?
బీజేపీ వికారాబాద్‌నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకుంటోంది. మాజీ మంత్రి చంద్రశేఖ‌ర్ దాదాపుగా 23 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప‌నిచేయ‌డం.. లోక‌ల్‌గా ప‌ట్టుఉండ‌టం... బీజేపీ వేవ్ క‌లిసివ‌స్తాయ‌ని  భావిస్తున్నారు.

కొప్పుల బ్రదర్స్‌మధ్య విభేదాలు
పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్‌రెడ్డి మొదటిసారి ఎన్నికయ్యారు. మహేశ్‌రెడ్డి సోదరుడు అనిల్‌రెడ్డి చాలా యాక్టివ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్‌మొదలైనట్టు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని నేరుగా కేటీఆర్‌ను కలిసి అనిల్‌రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కొప్పుల బ్రదర్స్‌మధ్య విభేదాలు తలెత్తడంతో మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌బి.మనోహర్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలో క్యాడర్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ఆశించి భంగపడ్డ మనోహర్‌.. కేటీఆర్‌సపోర్ట్‌తో జిల్లా బ్యాంక్‌ఛైర్మన్‌పదవి దక్కించుకున్నారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సమర్ధవంతుడైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. ఎన్నికల నాటికి అధికార పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేయడమే బిజేపీ స్కెచ్ గా కనిపిస్తుంది.

తాండూరు టీఆర్‌ఎస్‌లో వర్గపోరు
తాండూరు టిఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో నేనంటే నేనే అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రోహిత్ రెడ్డి...మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత రోహిత్ టిఆర్ఎస్ లో చేరడం..అధిష్టానం వద్ద పట్టు సాధించడంతో పట్నం మహేందర్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారాడు.

ఎమ్మెల్యేగా ఓడినా మహేందర్ రెడ్డి.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వివాదం సద్దుమణగని పక్షంలో మంత్రి సబితారెడ్డిని తాండూరు బరిలో దించాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. సబితారెడ్డి పుట్టిల్లు తాండూరు కావడం.. ఎన్నికల్లో ఆమెకు కలిసొస్తుందని ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీలో లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతున్నాయి.

ఎంఐఎం పోటీలో ఉంటే ఫలితం తారుమారు
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేష్‌కు.. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ చేతిదాక వచ్చి జారిపోయింది. చివరి నిమిషంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తన అనుచరుడైన రోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆ తరువాత రోహిత్ పార్టీ మారి కొండా విశ్వేశ్వరరెడ్డికి దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని గెలవాలని రమేష్ భావిస్తున్నారు. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం పార్టీలో రమేష్‌ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీలో బిజేపీకి పట్టు ఉండటం కలిసొస్తుందని రమేష్ భావిస్తున్నారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ఎంఐఎం కూడా తాండూరులో పావులు కదుపుతోంది. ఎంఐఎం పోటీలో దిగితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement