సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఇన్‌చార్జులుగా నియమితులైన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు సీరియస్‌గా వ్యవహరించకపోవడంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించినా ఇన్‌చార్జులుగా నియమితులైన కొందరు నేతలు ఇంకా తమ యూనిట్లకు చేరుకోకపోవడంపై మండిపడినట్టు తెలిసింది. మంత్రి మల్లారెడ్డి ఏర్పాటు చేసిన విందు వివాదాస్పదమై, సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం జరగడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
టీఆర్‌ఎస్‌లో ఇలాంటి సమన్వయ లోపాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోమవారం పార్టీ ఇన్‌చార్జులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. మంత్రి మల్లారెడ్డి విందు తరహా ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించినట్టు తెలిసింది. బీజేపీ ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూపుతూ ప్రతికూల ప్రచారం చేసి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని.. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అలాగే వ్యవహరించిందని గుర్తు చేసినట్టు సమాచారం.
పథకాల లబ్ధిదారులను కలిసేలా..
ఇప్పటికే ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గ్రామాల వారీగా గుర్తించి, వారి వివరాలతో కూడిన జాబితాలను టీఆర్‌ఎస్ యూనిట్ ఇన్‌చార్జులకు అందజేసినట్టు తెలిసింది. నేతలు లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం ద్వారా జరిగిన మేలును గుర్తుచేయనున్నట్టు సమాచారం. ఆయా లబ్ధిదారులు టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఎం కేసీఆర్ లేఖలు రాయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ముందే అప్రమత్తమైనా..
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ ముందే అప్రమత్తమైంది. పార్టీపరంగా ప్రతీ వంద ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జులను నియమించారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్‌లతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. దసరా మరునాటి నుంచే యూనిట్ బాధ్యులు క్షేత్రస్థాయికి చేరుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటికీ చాలాచోట్ల నేతలు క్షేత్రస్థాయికి వెళ్లలేదని, ఆయా చోట్ల మందకొడిగా ప్రచారం సాగుతోందని టీఆర్‌ఎస్ పెద్దలు గుర్తించినట్టు తెలిసింది. ముందే అప్రమత్తమైనా ఇలా జరగడం సరికాదని.. అలసత్వం వద్దని, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం.
14న భారీ ర్యాలీకి సన్నాహాలు
మునుగోడు ఉప ఎన్నికకు ఈనెల 14తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. దీనితో ఆ రోజున భారీ హంగామా మధ్య టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సమర్పించనున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా నామినేషన్ వేసిన నేపథ్యంలో.. అంతకు మించి జన సమీకరణ లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 14న నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆలోగా యూనిట్ ఇన్‌చార్జులుగా నియమితులైన నేతలు తమ పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు పూర్తిచేయాలని.. 14 నాటి ర్యాలీకి జన సమీకరణ చేయాలని సూచించినట్టు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment