సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల
మోదీ ప్రమేయం లేకుండానే వచ్చారా?
ప్రధాని నరేంద్ర మోదీని అడుగుతున్నా. నీకు ఇంకా ఏం కావాలి. దేశంలో ప్రధాని పదవిని మించి ఇంకా ఏముంది? ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఇంకా ఎందుకీ కిరాతకం. మోదీ ప్రమేయం లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చారా? వాళ్లు ఆఫర్ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరున్నారో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హులు కాదు.
– సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు ఇస్తాం. పార్టీ విడిచిపెట్టి రమ్మంటే మన వాళ్లు వారిని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా.. మేం అంగట్లో సరుకులం కాదు అంటూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది కొంతే. కానీ దొరికిన దొంగతనం ఎంతో ఉంది. ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉంది.
రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప నివృత్తి లేదు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వంద కోట్లు ఇస్తామంటే గడ్డిపరకతో సమానమని వదిలేసి, నిఖార్సయిన తెలంగాణ బిడ్డలుగా ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల ఎత్తున ఎగరేశారని, అలాంటి బిడ్డలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులోని బంగారిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
మోదీ ఎందుకీ అరాచకం?
‘‘వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొల్లగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? ఎందుకీ అరాచకం. దేశానికి, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికారు. వారు ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
ఎవరో ఒక తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తవా అంటడు. ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తవా అంటడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు కనిపించడం లేదా? నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాల్లో ఉంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేశా అంటారు. అందుకే ఆ విషయం నేను ఎక్కువగా చెప్తలేను. కానీ విద్యావంతులు, మేధావులు మౌనంగా ఉంటే మనకు శాపమైతది. మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఊరికి వెళ్లాక దీనిపై చర్చ చేయాలి. ఎవడో చెప్పిండని మాయమాటలకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరగదు.
జీఎస్టీతో చేనేతకారులకు శిక్ష వేస్తున్న మోదీ
దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం మోదీ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. మీ ఓటు వేయించుకొని మిమ్మల్నే పోటు పొడుస్తానని చెప్పే బీజేపీకి ఓటేస్తారా.. ఆలోచించుకోండి. పోస్టు కార్డు ఉద్యమంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు. వామపక్షాలు, టీఆర్‌ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి.
బీజేపీ గెలిస్తే ప్రైవేటీకరణే..
ఎన్నికల్లో ప్రలోభాలకు ఆశపడితే గోసపడతాం. 60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే ఎంత ఏడ్చింది తెలంగాణ. 58 ఏళ్లు కొట్లాడినం. ఎంతోమంది మన బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు ఓటు జాగ్రత్తగా వేయకపోతే పెట్టుబడిదారులకు మనమే సద్దికట్టినట్టు అయితది. మనమే ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్టు అవుతుంది. మీటర్లు పెట్టే వారికి డిపాజిట్ వచ్చినా నన్ను పక్కకు నెడతారు. కేసీఆర్ గట్టిగ మాట్లాడుతున్నారని, 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టి, తెలంగాణను కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ గద్దలకు వ్యవసాయాన్ని అప్పగించాలన్న కుట్ర జరుగుతోంది. వారికి బుద్ది చెప్పకపోతే కష్టపడేది మనమే.
మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా..
మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండదండగా ఉంటాను. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలె. ఎవరు చేయాలి? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అయినా మోదీ నీటి వాటా ఎందుకు తేల్చడం లేదు. నేను మహా మొండిని. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా. ఇంతకు ముందు గోదలాంటి ప్రభాకర్‌రెడ్డిని ఓడించి గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారు. ఆ గొడ్డలి పుణ్యమాని రోడ్లు సరిగా లేవు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే ఆ రోడ్లను బాగుచేయించే బాధ్యత నాది.
మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి
దేశంలో సక్కదనం ఏముంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎంత? 82 రూపాయలా? నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వానంగా ఉంటదా? ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? ప్రకృతి వనరులు, సంపదలున్న దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్ రూ.1,200 చేసింది ఎవరు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎవరు? పైగా వారికి ఓటు వేయాలా? అంత పౌరుషం లేకుండా ఉన్నామా? వడ్లు కొనుమంటే కొనరట కానీ రూ.100 కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారట. ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది.
జగదీశ్‌రెడ్డి ఏం తప్పు చేశారు?
మంత్రి జగదీశ్‌రెడ్డి లేకుండా గత 20 ఏళ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు బాధతో వచ్చాను. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు చేశారు. ఎందుకు నిషేధించారు. గుండాగిరి చేశారా? ఎవరినైనా కొట్టారా? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. చాలా బాధగా ఉంది. వీటన్నింటికి 3వ తేదీన ఓటుతో జవాబు చెప్పాలి.’’
Comments
Please login to add a commentAdd a comment