సాక్షి, వరంగల్: ఓరుగల్లు టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) నేతలు కమలం వైపు చూస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి కొనసాగిన నేతలు తమకు ఆదరణ లేదంటూ ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ జూలై 31న టీఆర్‌ఎస్‌ను వీడారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్, సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆగస్టు 7న ‘కారు’ దిగారు. తాజాగా గురువారం పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.
ఈనెల 9న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్లు భిక్షపతి స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు తోడు చేరికల కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియామకం తర్వాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నాయకత్వం ఇతర పార్టీల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల రేసులో ఉన్న సీనియర్ నాయకులతో సంప్రదింçపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల్లో ఉన్న ఓరుగల్లు నేతలు కమలం పార్టీ వైపు చూస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
చదవండి: కాంగ్రెస్‌లో దేనికి పట్టం?, పనితనమా? విధేయతా?
కొనసాగుతున్న బీజేపీ ఆపరేషన్
బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. వరంగల్‌లో మాత్రం ఆ పార్టీకి షాక్ తగులుతోంది. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం వరంగల్ కాగా.. ఉమ్మడి జిల్లాపై బీజేపీ గురి పెట్టింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లను పార్టీలో చేర్చుకునేందుకు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మొలుగూరి భిక్షపతి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు చర్చ జరుగుతోంది. పార్టీకి రాజీనామా చేసిన భిక్షపతి.. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఆరోపణలు చేశారు.
అధిష్టానం విధి విధానాలు, ఏకపక్ష పోకడలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదివరకు పార్టీని వీడిన కన్నెబోయిన రాజయ్య యాదవ్ సైతం రాజీనామాకు గల కారణాలను వివరించి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని.. రాజ్యసభ హామీని కూడా మరిచారని వాపోయారు. కారు పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అసలు ఉద్యమకారులే లేరని వ్యాఖ్యానించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నిస్వార్థంగా పనిచేసినట్లు తెలుపుతూ.. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై విమర్శలు చేసి పార్టీని వీడారు.
చదవండి: మునుగోడు బరిలో గద్దర్.. ఆ పార్టీ నుంచే పోటీ!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మొలుగూరి భిక్షపతి
ఎవరీ మొలుగూరి భిక్షపతి
2009 సాధారణ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మొలుగూరి భిక్షపతి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణానంతరం సురేఖ తన పదవికి రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొలుగూరి భిక్షపతి కొండా సురేఖపై గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున టికెట్ ఆశించి నిరాశపడ్డారు. ఆ తర్వాత అధికార పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఉద్యమ పార్టీలో ఆదరణ కరువైందనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు గురువారం పరకాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment