సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలకు ప్రయత్నించారంటూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన ఫామ్‌హౌజ్.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందినదే. మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఈ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించారు.
అనంతరం రోహిత్‌రెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని బయలుదేరారు. ఆ వాహనం నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంది. రోహిత్‌రెడ్డికి చెందిన సొంత వాహనం పోలీసు వాహనం వెనకాలే వెళ్లింది. మిగతా ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ముగ్గురూ ముందుగానే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ రోహిత్‌రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
కేసీఆర్‌తో ‘ఆ నలుగురు’ భేటీ..
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు!
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్‌కు వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు పూసగుచి్చనట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశముందని సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీఆర్‌ఎస్ పిలుపునిచి్చంది. కాగా, మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ ప్రెస్‌మీట్ ముగిసిన సెకన్లలోనే.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు రావడం, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయతి్నంచారనే ఆరోపణలు, ఇతర వివరాలూ వైరల్ కావడం గమనార్హం.
ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో..
రోహిత్‌రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధి టలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్‌హౌజ్‌ను నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్‌హౌజ్ ఉంటుంది. రోహిత్‌రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
పూజల కోసమే వచ్చాం: నందకుమార్
ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతోపాటు ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు.
బ్యాగులు తెరవకుండానే..
మొయినాబాద్ రూరల్, రాజేంద్రనగర్: నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని, అందుకోసమే ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్ వద్దకు వచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించినప్పుడు.. రోహిత్‌రెడ్డికి చెందిన కారులో ఉన్న రెండు ట్రావెల్ బ్యాగులను తెరవాలని మీడియా కోరినప్పటికీ.. పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. గంట సేపు రోహిత్ రెడ్డిని రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని పోలీస్ వాహనంలోనే ఎక్కించుకొని ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఫామ్‌హౌస్ వద్ద హైడ్రామా సాగింది
Comments
Please login to add a commentAdd a comment