సాక్షి, హైదరాబాద్: దేశంలో కేంద్రం, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీతో గెలిచిందని.. అయినా మేయర్ పదవిపై బీజేపీ హంగామా చేసిందని మండిపడ్డారు. చివరికి సుపప్రీంకోర్టుకు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిందన్నారు.
సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్ర ఆర్డినెన్స్ తెచ్చిందని, సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా కేంద్రం గౌరవించడం లేదని మండిపడ్డారు. లెఫ్టెనెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని, ఇది దేశమంతా చూస్తోందని తెలిపారు.
సంబంధిత వార్త: హైదరాబాద్: కేసీఆర్‌తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ
కేజ్రీవాల్‌కు పూర్తి మద్దతు
లెఫ్టెనెంట్ గవర్నర్‌ను తీసుకొచ్చి ఎన్నికైన ప్రభుత్వపై కూర్చోబెట్టారు. ఢిల్లీ పాలనాధికారాలపై ఆర్డినెన్స్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రజలు మోదీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. ఢిల్లీ పాలనాధికారాలపై ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కాలరాసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టును తీర్పును కూడా లెక్కచేయరా? ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. బడ్జెట్‌ను పాస్‌కానివ్వనని గవర్నర్ అంటే ఎలా? అసలీ గవర్నర్‌ల వ్యవస్థ ఏంది?. కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు. కేజ్రీవాల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కేంద్ర ఆర్డినెన్స్ ప్రజాస్వామ్య విఘాతం: కేజ్రీవాల్
కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ సరికాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ ప్రజల కోసమే కాదు దేశ ప్రజల కోసం తమ పోరాటమని తెలిపారు. ఢిల్లీలో వరుసగా రెండుసార్లు తామే గెలిచాం. ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వం అంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలని సుప్రీం చెప్పిందని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్య విఘాతమని, షీలాదీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని అధికారులు ఆమె చేతిలోనే ఉన్నాయని గుర్తు చేశారు.
సీఎంగా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా.
‘కేంద్రం తీరు వల్ల ఢిల్లీ సీఎంగా నేను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా. కొన్ని శాఖల కార్యదర్శలను సైతం బదిలీ చేసే పరిస్థితి లేదు. కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానకరం. 8 ఏళ్లు పోరాటం చేశాం. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను పక్కనబెడుతూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చింది.
కేసీఆర్ మద్దతుతో అండ పెరిగింది.
మోదీ వచ్చాక ఆ అధికారాలన్నీ పోయాయి. 2015 లో మేం అధికారంలోకి వచ్చాక మా నుంచి అధికారాన్ని లాక్కున్నారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తుంది. బీజేపీ తీరుతో దేశం ప్రమాదకర స్థితిలో ఉంది. సీఎం కేసీఆర్ మద్దతుతో మాకు అండ పెరిగింది మాకు మద్ధతు ప్రకటించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరగాలి’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
చదవండి: ప్రజాస్వామ్య సౌధం.. చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి.. ఎన్నింటినో తట్టుకుని..
Comments
Please login to add a commentAdd a comment