సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్‌ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ ఆధిక్యత సాధిస్తారని పార్టీ అంచనా వేసింది.
ఈ మేరకు మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్‌చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు. పోలింగ్ బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందు పరిచారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈ నివేదికలను క్రోడీకరించి శుక్రవారం పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
పోలైన ఓట్లలో 50శాతం మేర ఓట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి సాధిస్తాడని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్‌చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి పార్టీ తరపున ఏజెంట్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది.
పార్టీ తరపున ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లకు శనివారం అవగాహన కల్పిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే సుమారు పక్షం రోజులపాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తలమునకలైన నేతలు గురువారం రాత్రి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ కేడర్‌ను సమన్వయం చేశారు.
చదవండి: Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే
Comments
Please login to add a commentAdd a comment