నేడు నల్లగొండలో కేసీఆర్‌ సభ | KCR Public Meeting To Be Held In Nalgonda On February 13th, Krishna Water Share Became Hot Topic - Sakshi
Sakshi News home page

KCR Nalgonda Meeting Today: నేడు నల్లగొండలో కేసీఆర్‌ సభ

Published Tue, Feb 13 2024 1:05 AM | Last Updated on Tue, Feb 13 2024 10:53 AM

KCR meeting in Nalgonda on February 13th - Sakshi

నల్లగొండ పట్టణ శివారు మర్రిగూడ బైపాస్‌ వద్ద సిద్ధమైన సభావేదిక

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తొలిసారి జనంలోకి అడుగుపెడుతున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతుగర్జన పేర బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా ఎండగట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్‌ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.  

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సభకు ప్రాధాన్యం 
గత ఏడాది డిసెంబర్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పార్టీ అధినేత కేసీఆర్‌ తుంటి ఎముక శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ నేతలతో నందినగర్‌ నివాసంలో, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయిన కేసీఆర్, ఇప్పటివరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఈనెల 1న గజ్వేల్‌ ఎమ్మెల్యేగా స్పీకర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ అదేరోజు తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నా, కేసీఆర్‌ వాటికి దూరంగా ఉన్నారు. కానీ నల్లగొండ సభలో కేసీఆర్‌ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

తెలంగాణభవన్‌ నుంచి నల్లగొండ సభకు 
పార్టీ ముఖ్య నేతలు తెలంగాణభవన్‌ నుంచి బయలుదేరేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్లగొండ సభకు హాజరవుతారు. కేటీఆర్‌ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్లగొండకు వెళతారు. కేసీఆర్‌ మాత్రం హెలికాప్టర్‌ ద్వారా నల్లగొండకు చేరుకొని, సభ అనంతరం తిరిగి వాయుమార్గాన హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నల్లగొండసభకు కీలక నేతలు హాజరు కావడం ద్వారా ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement