తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు | BJP takes out bike rally to commemorate Hyderabad Liberation Day | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు

Sep 16 2023 3:30 AM | Updated on Sep 16 2023 3:30 AM

BJP takes out bike rally to commemorate Hyderabad Liberation Day - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌ / రసూల్‌పుర: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో మీటింగ్‌ పెట్టే నైతికత కాంగ్రెస్‌ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్‌లో మీటింగ్‌ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు  విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్‌.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

సెప్టెంబర్‌ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్‌ చేస్తూ సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌ నుంచి చేపట్టిన బైక్‌ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని  లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు.

 సీఎం కేసీఆర్‌ను మజ్లిస్‌ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్‌ఎస్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్‌ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్‌ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు.

బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్‌ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.  

పరేడ్‌ గ్రౌండ్‌ టు పరకాల 
తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్‌ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌  ప్రకాశ్‌ జవదేకర్‌ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా బైక్‌ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన  పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్‌ మైదానం నుంచి సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు  ఏడు గంటల పాటు బైక్‌ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement