guvvala balaraju
-
కొత్త ప్రభాకరరెడ్డి, గువ్వల బాలరాజుల మీద దాడిపై సీరియస్
-
నా భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను :అమల
-
Telangana: ముక్కోణపు పోటీ తప్పదా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో ఈసారి ముక్కోణపు పోటీ గట్టిగానే కనిపిస్తోంది. అయితే అన్ని పార్టీలు గెలుపు తమదే అంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీజేపీ కూడా గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉంది. అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలోకి వచ్చిన అచ్చంపేటలో గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన అధికార గులాబీ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన అచ్చంపేటలో రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణ మీదే బాలరాజు గెలిచారు. పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్ప..ఎమ్మెల్యే ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదనే విమర్శ ఉంది. నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రయత్నమే చేయలేదని అధికార పార్టీ నేతలే అంటున్నారు. చెంచులు నివసించే ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య ఇప్పటికీ తీరలేదు. పోడు భూముల వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో అడవిబిడ్డలైన పోడు రైతులు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. ఇటీవలే ఉమామహేశ్వర్ రిజర్వాయర్‌కు శంకుస్దాపన చేశారు. మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు కొందరు ఎమ్మెల్యే వైఖరితోనే పార్టీకి దూరమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్ని ఆయనకు చెప్పే దైర్యం చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కారు దిగి హస్తం గూటీకి చేరటం ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే భూ వివాదాల్లో తలదూర్చి ఒకపక్షం వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదు. పేదలకు కనీసం ఇళ్ల స్దలాలు కూడా ఇవ్వలేదు. అయితే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందటం గువ్వల బాలరాజుకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుకు, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములుకు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఎంపీ రాములు తనయుడు భరత్‌ప్రసాద్ నాగర్‌కర్నూల్ జడ్పీచైర్మన్ గా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్‌ప్రసాద్ ఆయన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ రాములు అచ్చంపేటలో సీఎం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనకపోవటం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అధికార బీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. బాలరాజ్ మాత్రం పదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ఆశతో ఉన్నారు. నియోజకవర్గంలో సాగునీరందించే ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు ఇటీవల శంకుస్దాపన చేయటం, వంద పడకల ఆస్పత్రి ప్రారంభం చేయటం ఎమ్మెల్యేకు కలిసి వచ్చే అంశంగా ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి ఆ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు. మొదటి జాబితాలోనే అధిష్టానం ఆయన పేరు ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్‌రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సీటు తప్పకుండా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని మండిపడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గపోరు, అంతర్గత విబేదాలు వంశీకృష్ణకు కలిసి వస్తాయని ఆశపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో వంశీకృష్ణ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారేంటీలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో వంశీకృష్ణ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగ సామాజిక వర్గ ఓట్లు మైనస్‌గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అచ్చంపేటలో జెండా ఎగరేయాలని కాషాయ పార్టీ ఆశపడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ అచ్చంపేటలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. -
మొగులయ్యకు ఇచ్చే స్థలం అంత దూరమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసంతృప్తి!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై అచ్చంపేట(నాగర్‌కర్నూల్) బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇవాళ కొందరికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. ప్రముఖ కళాకారుడు.. కిన్నెర వాయిద్యకారుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు .. బీఎన్‌రెడ్డి కాలనీలో స్థలం కేటాయించారు. గతంలో మొగులయ్యను ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకొచ్చినప్పుడు.. ఇళ్ల స్థలం కేటాయింపజేసే బాధ్యతను గువ్వల బాలరాజుకు అప్పగించారు సీఎం. అయితే ఇవ్వాళ్టి ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీకి అసలు తనని పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు గువ్వల బాలరాజు. మొగులయ్యను ఢిల్లీ తీసుకెళ్లి ఆయన కళను గుర్తు చేసింది తానేనని, ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉందని బాలరాజు గుర్తు చేశారు. కొందరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మొగులయ్యకు మాత్రం BN రెడ్డి కాలనీలో కేటాయించడం సరికాదని, క్రీడాకారులకు కేటాయించిన జాగలతో పోలిస్తే.. మొగులయ్యకు కేటాయించిన స్థలం విలువ తక్కువని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తున్నారు. -
అలా చేసినందుకు కాల్ చేసి.. బెదిరిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: కొంతమంది ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర పురోభివృద్ధికి శ్రమిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు చేస్తున్న విమర్శలకు మీడియా ముఖంగా సమాధానం చెబితే రౌడీల చేత తనకు ఫోన్‌కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగువర్గాలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై కొన్ని పారీ్టలు కుట్రలు చేస్తున్నాయని, ఆ వర్గాలను ఆర్థికంగా బలోపేతం కాకుండా చూడాలన్నదే వాళ్ళ ఆలోచనన్నారు. -
TS: హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్కు పొంగులేటి సవాల్.. -
ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం జనాలకు ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారట. అందుకే తమ పీఏలు, అనుచరులతో పనులు చక్కబెడుతున్నారని టాక్. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫాంహౌజ్‌కే పరిమితం.? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీకే 13 దక్కాయి. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన భీరం హర్షవర్థన్‌రెడ్డి కూడా తర్వాతి కాలంలో కారెక్కి హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హర్షవర్థన్‌రెడ్డితో పాటు.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు ఆ ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాతి నుంచి తమ నియోజకవర్గాలకు రావటం లేదు. దీంతో వారు ప్రజలకు ముఖం చాటేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు ఆ వ్యవహారంలో తలదూర్చారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే వారిద్దరు మాత్రమే ప్రగతిభవన్‌ను వదలటం లేదు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఇంటెలిజెన్స్ సూచన మేరకే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతుండటం విశేషం. ప్రభుత్వం కూడా వీరికి భద్రత పెంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు సమకూర్చింది. ఆయినా వారు నియోజకవర్గాల్లోకి రావడానికి భయపడుతున్నారు. గోడకెక్కిన గువ్వల అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు అతికించటం కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లలో ఫోటోలు కూడా పెట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డిపై దాడి.. వికలాంగుడిపై దాడి.. గిరిజన సర్పంచ్‌పై దాడి.. ఫారెస్టు ఆఫీసర్‌పై దాడి.. సీఎం పర్యటనలో నన్నే ఆపుతావారా అంటు సీఐపై చిందులు వేశారంటూ పోస్టర్లలో ప్రచురించారు. వీటిని స్దానికులు ఆశ్చర్యంగా చూస్తుండటం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోస్టర్ల వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: (హీటెక్కిన తెలంగాణ పొలిటికల్ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?) తమ నేతను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. గతంలో కూడ పలు సందర్భాల్లో గువ్వల బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత ఎమ్మెల్యేపై తిట్లపురాణంతో సాగుతున్న ఫోన్ సంభాషణలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వందకోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యేను తరమికొట్టాలని.. అందుకు అన్నివర్గాల వారు సహకరించాలని..ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయి కష్టాలు కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ మారి ఆనేక విమర్శలు ఎదుర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారిన నాయకుడు డబ్బు కోసం ఇప్పుడు కూడా మారడని గ్యారెంటీ ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సఖ్యత లేని కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. దిద్దుబాటు చర్యలకు అధిష్టానం పెద్దగా చొరవ చూపకపోవటంతోపాటు.. ఫామ్ హౌజ్ వ్యవహారంతో పార్టీకి నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొల్లాపూర్‌కు రావాలని ప్రయత్నించినా స్దానికంగా ఉండే తన అనుచరుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడ ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యే వైరివర్గం నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపధ్యంలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల బాటపడతారో లేక ఫాంహౌస్ కేసు తెగేంతవరకు దూరంగా ఉంటారో చూడాలి. -
హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్‌కే.. కేసీఆర్‌తో ఆ నలుగురు భేటీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలకు ప్రయత్నించారంటూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన ఫామ్‌హౌజ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందినదే. మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఈ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించారు. అనంతరం రోహిత్‌రెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని బయలుదేరారు. ఆ వాహనం నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంది. రోహిత్‌రెడ్డికి చెందిన సొంత వాహనం పోలీసు వాహనం వెనకాలే వెళ్లింది. మిగతా ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ముగ్గురూ ముందుగానే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ రోహిత్‌రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌తో ‘ఆ నలుగురు’ భేటీ.. నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు! టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్‌కు వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు పూసగుచి్చనట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశముందని సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీఆర్ఎస్ పిలుపునిచి్చంది. కాగా, మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ ప్రెస్‌మీట్ ముగిసిన సెకన్లలోనే.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు రావడం, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయతి్నంచారనే ఆరోపణలు, ఇతర వివరాలూ వైరల్ కావడం గమనార్హం. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో.. రోహిత్‌రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధి టలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్‌హౌజ్‌ను నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్‌హౌజ్ ఉంటుంది. రోహిత్‌రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పూజల కోసమే వచ్చాం: నందకుమార్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతోపాటు ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు. బ్యాగులు తెరవకుండానే.. మొయినాబాద్ రూరల్, రాజేంద్రనగర్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని, అందుకోసమే ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్ వద్దకు వచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించినప్పుడు.. రోహిత్‌రెడ్డికి చెందిన కారులో ఉన్న రెండు ట్రావెల్ బ్యాగులను తెరవాలని మీడియా కోరినప్పటికీ.. పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. గంట సేపు రోహిత్ రెడ్డిని రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని పోలీస్ వాహనంలోనే ఎక్కించుకొని ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఫామ్‌హౌస్ వద్ద హైడ్రామా సాగింది -
ఎన్నికల్లో జై భీమ్.. బడ్జెట్లో నై భీమ్
సాక్షి, హైదరాబాద్: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జైభీమ్ నినాదమిస్తున్న బీజేపీ.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం దళిత గిరిజనుల అభ్యున్నతికి నిధులు కేటాయించకుండా నై భీమ్ అంటోందని విమర్శించారు. నమో అంటే నక్కజిత్తుల మోదీ అని, బీజేపీది గాడ్సేయిజం అయితే టీఆర్ఎస్ది అంబేడ్కరిజం అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో గురువారం జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికో వేషం, ప్రాంతానికో మోసంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీకి విశాల ధృక్పథం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తోడుదొంగల్లా ఢిల్లీలో కూడబలుక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. దేశ జనాభాలో 28 శాతం ఉన్న దళిత, గిరిజనుల కోసం తెలంగాణ రా్రష్ట్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా కేంద్ర బడ్జెట్లో వారి కోసం కేవలం రూ.12 వేల కోట్లు కేటాయించడాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారన్నారు. గాంధీని చంపిన గాడ్సేకు సెల్యూట్ కొడుతున్న బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ను అంబేడ్కర్ వ్యతిరేకులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తోందన్నారు. జపాన్, ఫ్రాన్స్, నేపాల్ వంటి దేశాలు రాజ్యాంగాన్ని తిరిగి రాసుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ, దేశంలో గుణాత్మక మార్పు కోసమే సీఎం కేసీఆర్ నడుం బిగించారని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. దళితులకు న్యాయం జరగనందునే..: కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించినా దళితులకు న్యాయం జరగనందునే సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చర్చను లేవనెత్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే కేసీఆర్ ప్రతిపాదనపై పార్లమెంటులో చర్చ పెట్టాలని సవాల్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లొట్టపీసు చట్టమని అవమానించిన బీజేపీ ఎంపీపై ఆ పార్టీ ఏం చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చినా అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా, సుస్థిరంగా ఉంటుందని గువ్వల బాలరాజు అన్నారు. -
పోలీసులపై నోరు పారేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
-
తీజ్ సంబరాలు: తీన్మార్ వేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
అచ్చంపేట: తీజ్ సంబురాలు అచ్చంపేట లో ఆదివారం అంబరాన్నంటాయి. జాగో బంజారా.. బొరావ్ తీజ్ అంటూ.. గిరిజనులు మొలకల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈనెల 21న ప్రారంభించిన తీజ్ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం ముగింపు వేడుకలు పురస్కరించుకుని సంప్రదాయ వాయిద్యం వాయిస్తూ యువతులు, మహిళలు చేసిన నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో యువతులు తీజ్ బుట్టలను తలపై ఉంచి కుటుంబసభ్యులతో కలిసి బహిరంగ ఊరేగింపులో సంప్రదాయ నృత్యం చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి గిరిజన బంధువులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించారు. చెరువులో నిమజ్జనం.. గిరిజన భవన్ వద్ద పందిరిపై ఏర్పాటు చేసిన తీజ్ బుట్టలను (మంచెపై) దింపి పీటమీద పెట్టి ఆట,పాటలతో తీజ్ నారును తెంపారు. రేగుచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమనారు(డోనా) చిన్న కర్ర(పీట)లతో యువతీ, యువకులు ఒకరిని ఒకరు ఆటపట్టించారు. మొలకల బుట్టలను తలపై పెట్టుకున్నారు. అమ్మాయిలతో పాటు కుటుంబసభ్యులు, పెద్దమనుషులు అంతాకలిసి ఊరేగింపుగా బయలుదేరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన తండాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. బుట్టలతో ఊరేగింపుగా నడింపల్లి చెరువు వద్దకు వెళ్లారు. చెరువు దగ్గర తమ సంప్రదాయ పద్ధతులతో మొలకల బుట్టలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. పూజలలో పాల్గొన్న అమ్మాయిలు తీసుకున్న రొట్టెలు, ఆకుకూరల ఆహారాన్నే సంప్రదాయ రీతిలో అందరూ అక్కడ తీసుకున్నారు. అనంతరం తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన గిరిజన భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్దమనషులకు యువతులు కాళ్లు కడిగి వారి ఆశీర్వాదం పొందారు. అమ్మాయిలకు కూడా పెద్దమనషులు కాళ్లు కడిగి ఆశీర్వదించారు. ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నృత్యం మొలకల పండుగ ఊరేగింపులో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, మనోహర్, మార్కెట్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాలజీ పాల్గొన్నారు. ఎంపీ రాములు గిరిజనులతో పాటు నృత్యం చేశారు. బంజారా గిరిజనులతో పాటు ఎమ్మెల్యేగువ్వల బాలరాజు సతీసమేతంగా పాల్గొన్నారు. అమల మొలకలను తలపై పెట్టుకుని చూపరులను ఆకర్షించారు. -
రేవంత్ రెడ్డి మరోసారి జైలుకు వెళ్లకు తప్పదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు గురువారం కౌంటర్ ఎటాక్ చేశారు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దళితుల కోసం కేసీఆర్ రూ.55వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అంతకముందు బుధవారం హైదరాబాద్ శివార్లలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో బుధవారం నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభలో రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఎండగట్టిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వం విప్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పుల్లెల
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వీకరించారు. గ్రీన్ ఇండియా మిషన్ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. -
'కుంతియా, ఆజాద్‌ల ఆరోపణలు అసత్యం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వంపై, పోలీసులపై కాంగ్రెస్ నేతలు కుంతియా, ఆజాద్‌లు చేసిన ఆరోపణలు అసత్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. గోపన్‌పల్లి భూ ఆక్రమణలు కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి కావాలనే అరెస్టు అయి జైలుకు వెళ్లాడని తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్లను ఎగిరేయడం చట్ట విరుద్ధం అన్నారు. చట్టాలు తెలిసిన వారు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు శోచనీయమని, ప్రతిపక్షాలు పసలేని పక్షాలుగా తయారయ్యాయని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నప్పటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 'అభివృద్ధి జరగలేదంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలను అచ్చంపేట నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నా. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. అసెంబ్లీలో ఒక నిర్మణాత్మకమైన చర్చకు తావివ్వాలని ప్రతిపక్షాలను నేను ఈ సందర్భంగా కోరుతున్నా' అంటూ బాలరాజు మీడియాకు వెల్లడించారు. -
'ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఒరగబెట్టిందేమి లేదు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి మాదిగలకు ఉపముఖ్యమంత్రి పదవిఘిచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ .. మంత్రి పదవి లేనంత మాత్రానా మాదిగలకు ఎలాంటి నష్టం జరగదని, కేసీఆర్ ఎన్నటికి మాదిగల వెన్నంటే ఉంటారని స్పస్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏం ఒరగబెట్టలేదని విమర్శించారు. ఎస్సీలకు సంబంధించిన ఎ,బి,సి,డిల వర్గీకరణ కేసీఆర్ హయాంలోనే జరుగుతుందని విశ్వసించారు. ఎస్సీ వర్గీకరణను తమకు వదిలేయాలంటున్న మందకృష్ణను, ఆయన చూపిస్తున్న కమట ప్రేమను మాదిగలు నమ్మొద్దని హితవు పలికారు. మందకృష్ణ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, మాదిగ ఉపకులానికి చెందిన కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తులేదా అంటూ మరో ఎమ్మెల్యే ఆరూరూ రమేశ్ తెలిపారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పక్కదారి పట్టించారని, సబ్‌ప్లాన్‌కు సంబంధించిన నిధులు దుర్వినియోగం కాకుండా కేసీఆర్ ప్రత్యేక చట్టం చేసిన సంగతి గుర్తు చేశారు. -
కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష: గువ్వల బాలరాజు
లండన్: టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏమ్మెల్యే గువ్వల బాలరాజుతో లండన్‌లో నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో యూకే నలుమూలల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఉద్యమ సమయం నుండి నేటి వరకు పార్టీలోని అనుభవాలని, కేసీఆర్ ప్రజారంజక పాలన గురించి గువ్వల బాలరాజు కార్యవర్గ సభ్యులతో పంచుకున్నారు. ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర గొప్పదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని – పథకాల గురించి వివరించారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఆహార్నిషలు కష్టపడుతున్నారని ఆయన నాయకత్వమే ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు. తనను వ్యక్తిగతంగా గానీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అన్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ప్రతినిధులు బాలరాజుని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అశోక్ దూసరి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ, ఈస్ట్ లండన్ కో-ఆర్డినేటర్ రమేష్ ఏసంపల్లి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, సత్య చిలుముల, వెస్ట్ లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం, ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, వెంకీ తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణను మరుగున పెట్టిన కాంగ్రెస్
గువ్వల, రసమయి విమర్శ సాక్షి, హైదరాబాద్: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎస్సీల ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ విషయాన్ని మరుగున పెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంగళవారం వారు విలేకరులతో మాట్లా డారు. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలపై సభ్యులు మాట్లాడుతున్న సంద ర్భంలో కొందరు సభ్యులు అభ్యంతరకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టిందన్నారు. మాదిగ జాతి కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత సీఎం కేసీ ఆర్కే దక్కుతుందన్నారు. పక్క రాష్టంలో ఇప్పటి వరకు కనీసం తీర్మానం చెయ్యలేదని, రేవంత్‌రెడ్డి తమ నేత, ఏపీ సీఎం చంద్ర బాబుతో తీర్మానం చేయిస్తే మాదిగ జాతి రేవంత్‌ను అక్కున చేర్చుకుంటుందన్నారు. దళితుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవా లని ఆరాట పడ్డ పార్టీలుగా టీడీపీ, కాంగ్రెస్ మిగిలాయన్నారు. కానీ వర్గీకరణను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. -
టీడీపీకి మాట్లాడే హక్కు లేదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్ లో రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన టీడీపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు మండి పడ్డారు. ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో వారిద్దరూ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును దేశమంతా ప్రశంసిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కన్నా చంద్రబాబు యావే రేవంత్ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో బాబు భజన చేస్తామంటే ఎలా ఒçప్పుకుంటామని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకు రేవంత్ ద్రోహం చేస్తున్నాడని వారు దుయ్యబట్టారు. -
సీఎం సాహసోపేత నిర్ణయం: గువ్వల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటవుతున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లేనని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఇంకా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి తెలంగాణ భవన్లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో నాల్గో జిల్లాగా గద్వాలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ నిర్ణయంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. సీఎంను కలిసే అవకాశం రావ డం లేదన్న ఎమ్మెల్యే వంశీ చంద్‌రెడ్డిపై మండిపడ్డారు. కలిసే అవకాశం ఉన్నా ప్రతిపక్షాలు అడ్డంగా మాట్లాడుతున్నాయన్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేస్తున్నందుకు సీఎంకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అవినీతిపై మీరా మాట్లాడేది ?
హైదరాబాద్ : మల్లన్నసాగర్‌పై రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎవరు అడ్డుకున్నా... ప్రాజెక్ట్‌ల నిర్మాణం మాత్రం ఆగదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. అవినీతి గురించి మీరా మాట్లాడేది ? అంటూ టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.భట్టి విక్రమార్కపై బాలసాని లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. అవినీతిపై మీరు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన ఉత్తమ్ ఆ శాఖను అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో దొరికిన కోట్లాది రూపాయిల గురించి.. ఇప్పటి వరకు లెక్క చెప్పలేదని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క పేపరు పులి అని ఆయన అభివర్ణించారు. భట్టి, ఉత్తమ్ అసమర్థులు కాబట్టే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయన్నారు. ముందుగా పదవులకు రాజీనామా చేయాలని ఉత్తమ్, భట్టిలను బాలసాని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. -
'సీపీఎం నేతల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు'
హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం నేతల అక్రమాలపై టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. సీపీఎం నేతల అక్రమాలపై ఆదివారం ఎలక్షన్ కమిషన్‌కు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫిర్యాదు చేశారు. తెల్దారుపల్లి బూత్నంబర్లు 116, 117, 118 లో కొన్ని దశాబ్దాలుగా సీపీఎం నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని బాల్కసుమన్ ఆరోపించారు. ఏ పార్టీ నేతలు ఆ గ్రామానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఈసీ ఎదుట వాపోయారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గ్రామంలో ఆయన నేతృత్వంలో ఇదంతా జరుగుతోందని చెప్పారు. తమ్మినేని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ బాల్కసుమన్ విమర్శించారు. -
'డీకే అరుణది దోచుకునే చరిత్ర'
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన చరిత్ర తమదైతే.. రాజకీయాల్లో దోచుకునే చరిత్ర డీకే అరుణదని ఆయన విమర్శించారు. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే మంత్రి జూపల్లి కృష్ణారావు అని బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆమెకు లేదని అన్నారు. ఇటీవల డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డీకే అరుణ, జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
వినాయక విగ్రహానికి వినతిపత్రం
అచ్చంపేట: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆశా కార్యకర్తలు శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటి ముట్టడికి యత్నించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. మరోవైపు తమ నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆశా కార్యకర్తలు భారీ రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో సర్కారుకు చిత్తశుద్ధిని ప్రసాదించాలని కోరుతూ తాండూరులో ఆశా కార్యకర్తలు వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. -
'అధికారమదంతో రౌడీయిజం'
గద్వాల (మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. శనివారం గద్వాల బంద్‌లో పాల్గొన్న అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో పాటు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై దాడికి పాల్పడిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలందరూ అసహ్యించుకునేలా, వీధి రౌడీలా అచ్చంపేట ఎమ్మెల్యే వ్యవహరించారని మండిపడ్డారు. దాడులతో ప్రతిపక్ష సభ్యులను భయపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బంద్‌ను విఫలయత్నం చేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు సహకరించారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరచి టీఆర్ ఎస్ఎమ్మెల్యేల అరాచకాలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల దౌర్జన్యాలను, దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పద్మావతి, నాయకులు కృష్ణారెడ్డి, సలాం, బండల వెంకట్రాములు, కుమ్మరి శ్రీనివాసులు, రామాంజనేయులు, వేణుగోపాల్, బాబర్, ఎల్లప్ప పాల్గొన్నారు. కాంగ్రెస్ భయపడదు: బిక్షమయ్య గౌడ్ సీఎం అండతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా మారిపోయారని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో ప్రజా సమస్యలను వ్రశ్నించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చేయి చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నదని లేకుంటే టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు గ్రామాల్లో కాలుపెట్టలేరన్నారు. -
నేడు గవర్నర్‌ను కలవనున్న టీ సీఎల్పీ నేతలు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే బాలరాజు దాడి అంశాన్ని టీ కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు గాంధీభవన్‌లో టి. కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. అనంతరం టి.కాంగ్రెస్ నేతలు రాజభవన్‌కు చేరుకుని.... చిట్టెంపై దాడి చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వారు వినతిపత్రం అందజేయనున్నారు. శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభం కాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడబోతుండగా టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలను నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించుకునేదాకా టీడీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదంటూ వారు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ భోజన విరామం ప్రకటించారు. తర్వాత తిరిగి సమావేశం మొదలవగానే గువ్వల బాలరాజు మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కొందరిపై, మాజీ మంత్రి డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించారు. దళితులను మాజీ మంత్రి డీకే అరుణ పట్టించుకోరని జెడ్పీ చైర్మన్ సైతం వ్యాఖ్యానించారు. దాంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న డీకే సోదరుడైన ఎమ్మెల్యే చిట్టెం పోడియం వద్దకు దూసుకెళ్లారు. బాల్‌రాజ్ అసందర్భ ప్రసంగాన్ని ఎలా అనుమతిస్తారంటూ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. బాల్‌రాజ్ సైతం పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఇరువురూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాల్‌రాజు ఆవేశంతో చిట్టెం చెంపపై కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. చిట్టెం తనను దూషించారని, దాడికి పాల్పడటంతో తన పెదవికి గాయమైందని చెబుతూ బాల్‌రాజు కూడా టీఆర్ఎస్ సభ్యులతో కలసి బైఠాయించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం చిట్టెం రాంమోహన్‌రెడ్డి... గువ్వల బాలరాజు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి నేపథ్యంలో శనివారం మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది.