ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో ఈసారి ముక్కోణపు పోటీ గట్టిగానే కనిపిస్తోంది. అయితే అన్ని పార్టీలు గెలుపు తమదే అంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా అధికార బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీజేపీ కూడా గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉంది. అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలోకి వచ్చిన అచ్చంపేటలో గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన అధికార గులాబీ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన అచ్చంపేటలో రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణ మీదే బాలరాజు గెలిచారు. పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్ప..ఎమ్మెల్యే ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఏమీ చేయలేదనే విమర్శ ఉంది. నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రయత్నమే చేయలేదని అధికార పార్టీ నేతలే అంటున్నారు. చెంచులు నివసించే ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య ఇప్పటికీ తీరలేదు. పోడు భూముల వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో అడవిబిడ్డలైన పోడు రైతులు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు.
బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. ఇటీవలే ఉమామహేశ్వర్ రిజర్వాయర్‌కు శంకుస్దాపన చేశారు. మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు కొందరు ఎమ్మెల్యే వైఖరితోనే పార్టీకి దూరమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్ని ఆయనకు చెప్పే దైర్యం చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కారు దిగి హస్తం గూటీకి చేరటం ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది.
ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే భూ వివాదాల్లో తలదూర్చి ఒకపక్షం వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా ఇవ్వలేదు. పేదలకు కనీసం ఇళ్ల స్దలాలు కూడా ఇవ్వలేదు. అయితే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందటం గువ్వల బాలరాజుకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుకు, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములుకు మధ్య వర్గపోరు నడుస్తోంది.
ఎంపీ రాములు తనయుడు భరత్‌ప్రసాద్ నాగర్‌కర్నూల్ జడ్పీచైర్మన్ గా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్‌ప్రసాద్ ఆయన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ రాములు అచ్చంపేటలో సీఎం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనకపోవటం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అధికార బీఆర్‌ఎస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. బాలరాజ్ మాత్రం పదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ఆశతో ఉన్నారు. నియోజకవర్గంలో సాగునీరందించే ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు ఇటీవల శంకుస్దాపన చేయటం, వంద పడకల ఆస్పత్రి ప్రారంభం చేయటం ఎమ్మెల్యేకు కలిసి వచ్చే అంశంగా ఉన్నాయి.
కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి ఆ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు. మొదటి జాబితాలోనే అధిష్టానం ఆయన పేరు ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్‌రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సీటు తప్పకుండా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని మండిపడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గపోరు, అంతర్గత విబేదాలు వంశీకృష్ణకు కలిసి వస్తాయని ఆశపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో వంశీకృష్ణ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారేంటీలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో వంశీకృష్ణ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగ సామాజిక వర్గ ఓట్లు మైనస్‌గా మారే అవకాశం ఉంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అచ్చంపేటలో జెండా ఎగరేయాలని కాషాయ పార్టీ ఆశపడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ అచ్చంపేటలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment