సాక్షి, హైదరాబాద్: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జైభీమ్ నినాదమిస్తున్న బీజేపీ.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం దళిత గిరిజనుల అభ్యున్నతికి నిధులు కేటాయించకుండా నై భీమ్ అంటోందని విమర్శించారు.
నమో అంటే నక్కజిత్తుల మోదీ అని, బీజేపీది గాడ్సేయిజం అయితే టీఆర్‌ఎస్‌ది అంబేడ్కరిజం అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో గురువారం జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికో వేషం, ప్రాంతానికో మోసంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీకి విశాల ధృక్పథం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తోడుదొంగల్లా ఢిల్లీలో కూడబలుక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.
దేశ జనాభాలో 28 శాతం ఉన్న దళిత, గిరిజనుల కోసం తెలంగాణ రా్రష్ట్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా కేంద్ర బడ్జెట్‌లో వారి కోసం కేవలం రూ.12 వేల కోట్లు కేటాయించడాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారన్నారు. గాంధీని చంపిన గాడ్సేకు సెల్యూట్ కొడుతున్న బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ను అంబేడ్కర్ వ్యతిరేకులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తోందన్నారు. జపాన్, ఫ్రాన్స్, నేపాల్ వంటి దేశాలు రాజ్యాంగాన్ని తిరిగి రాసుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ, దేశంలో గుణాత్మక మార్పు కోసమే సీఎం కేసీఆర్ నడుం బిగించారని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.
దళితులకు న్యాయం జరగనందునే..: కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించినా దళితులకు న్యాయం జరగనందునే సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చర్చను లేవనెత్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే కేసీఆర్ ప్రతిపాదనపై పార్లమెంటులో చర్చ పెట్టాలని సవాల్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లొట్టపీసు చట్టమని అవమానించిన బీజేపీ ఎంపీపై ఆ పార్టీ ఏం చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చినా అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా, సుస్థిరంగా ఉంటుందని గువ్వల బాలరాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment