'అధికారమదంతో రౌడీయిజం'
గద్వాల (మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. శనివారం గద్వాల బంద్‌లో పాల్గొన్న అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో పాటు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై దాడికి పాల్పడిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజలందరూ అసహ్యించుకునేలా, వీధి రౌడీలా అచ్చంపేట ఎమ్మెల్యే వ్యవహరించారని మండిపడ్డారు. దాడులతో ప్రతిపక్ష సభ్యులను భయపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బంద్‌ను విఫలయత్నం చేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు సహకరించారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరచి టీఆర్ ఎస్ఎమ్మెల్యేల అరాచకాలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల దౌర్జన్యాలను, దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ పద్మావతి, నాయకులు కృష్ణారెడ్డి, సలాం, బండల వెంకట్రాములు, కుమ్మరి శ్రీనివాసులు, రామాంజనేయులు, వేణుగోపాల్, బాబర్, ఎల్లప్ప పాల్గొన్నారు.
కాంగ్రెస్ భయపడదు: బిక్షమయ్య గౌడ్
సీఎం అండతో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా మారిపోయారని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో ప్రజా సమస్యలను వ్రశ్నించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చేయి చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నదని లేకుంటే టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కరు గ్రామాల్లో కాలుపెట్టలేరన్నారు.