తన చివరి రక్తపుబొట్టు వరకు తెలంగాణకు అన్యాయం చేయబోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటలు పూర్తిగా అబద్దమని...
తెలంగాణపై చంద్రబాబుది దొంగ ప్రేమ: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తన చివరి రక్తపుబొట్టు వరకు తెలంగాణకు అన్యాయం చేయబోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటలు పూర్తిగా అబద్దమని, తెలంగాణ ప్రజల చివరి రక్తపు బొట్టును పీల్చడానికే దొంగ ప్రేమ నటిస్తున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన బాబు చివరకు విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తున్నారని వారు విమర్శించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎ.జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి 44 టీఎంసీల నీటిని అదనంగా తీసుకుని కూడా, కుడి కాల్వకు నీటిని విడుదల చేయకుంటే డ్యామ్‌ను బద్దలు కొడతామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రకటించడం వెనుక చంద్రబాబు ఉన్నాడని వారు ఆరోపించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.