సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఉప ఎన్నికల్లో విజయవంతంగా పార్టీని గెలిపించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికే మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతను అధిష్టానం అప్పగించింది. రాష్ట్రంలో జరిగిన మిగతా ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావును ఇన్‌చార్జీగా నియమించిన గులాబీ బాస్ మునుగోడు ఎన్నికల బాధ్యతలను మాత్రం జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే పెట్టారు. 2018 తరువాత ఉమ్మడి జిల్లాలో మూడో ఉప ఎన్నిక అయిన మునుగోడులో పార్టీ అభ్యర్థిని గెలిపించి తీసుకురావాలని గులాబీ బాస్ ఆదేశించడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి తన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
మూడో ఉప ఎన్నిక
నాగార్జునసాగర్ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో జరిగిన ఆ ఉప ఎన్నికలో అక్కడి నేతలందరిని మంత్రి జగదీశ్‌రెడ్డి సమన్వయం చేసి నర్సింహయ్య తనయుడు భగత్‌ను గెలిపించారు. హుజూర్‌నగర్‌కు 2019లో ఉప ఎన్నిక జరిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా అదే సంవత్సరం జరిగింది. అందులో ఆయన సతీమణి పద్మావతిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేశారు.
అక్కడ 2018 ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరిగి దక్కించుకునేలా మంత్రి పనిచేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే ఇప్పుడు అక్కడ పోటీలో దింపింది. ఈ ఎన్నికల బాధ్యతను కూడా అధిష్టానం జగదీశ్‌రెడ్డిపైనే పెట్టింది.
టీఆర్‌ఎస్ గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లే
నియోజకవర్గంలో మొదట్లో తలెత్తిన అన్ని విభేదాలను అధిష్టానం సహకారంతో పరిష్కరించి, జిల్లాలోని అన్ని వర్గాల నేతలను ఏకతాటిపై తెచ్చి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేలా ప్రణాళికతో మంత్రి ముందుకు సాగుతున్నారు. అందరూ ఆయన నేతృత్వంలో సమన్వయంతో పనిచేసేలా అధిష్టానం చర్యలు చేపట్టింది. సీపీఎం, సీపీఐలను సమన్వయం చేస్తూ జగదీశ్‌రెడ్డి మంత్రాంగం నడుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహకర్తగా హ్యాట్రిక్ సాధించినట్లే.
చదవండి: మునుగోడులో విజయం నాదే : మారం వెంకట్‌రెడ్డి
మండలాలకు చేరుకున్న ఇన్‌చార్జీలు
టీఆర్‌ఎస్ అధిష్టానం మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎంపీటీసీ స్థానానికి నియమించిన ఇన్‌చార్జీలు చాలా మంది తమ స్థానాలకు చేరుకుని ప్రచారంలోకి దిగారు. ఆయా మండలాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు పెట్టారు. చౌటుప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పార్టీ కార్యకర్తల సమావేశాల్లో నిమగ్నమయ్యారు.
సాక్షి, నల్లగొండ: మోదీ, అమిత్ షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు యశ్వంత్ కుమార్, మర్రిగూడ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రావుల మధుతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రావుల రమేష్, బీజేపీ సీనియర్ నేత జగన్, నరేష్, బుర్రాసైదులు, బచ్చనగోని సైదులు, రావుల సతీష్ టీఆర్‌ఎస్‌లో చేరారు.
కాంగ్రెస్ పార్టీకీ చెందిన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకుడు చాపల పెద్ద సైదులు, చాపల చిన్న సైదులు, యాదయ్య, రావుల రాజు, తాటికొండ సతీష్, చాపల సైదులు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రితో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మునిగి పోయే పడవగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు టీఆర్‌ఎస్‌లోకి వలసలే నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో బలపడిందన్నారు. దాంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment