
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల వివాదం నెలకొంది. మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం మొదలైననాటినుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారూ ఇక్కడ ఓటు కోసం నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం కొత్త ఓటరు నమోదుకు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తోంది. దాన్ని అవకాశంగా చేసుకొని మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు పెద్ద ఎత్తున కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. వాటన్నింటిని పరిశీలిస్తున్న అధికారులు అనర్హులకు ఓటు తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకు 10వేలకుపైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం.
రెండు మాసాల్లోనే 24,881 మంది..
మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 4 వరకు 24,881 మంది కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నారు. వీరితోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లినవారూ నమోదు చేసుకోవడంతో దరఖాస్తులు భారీగా వచ్చాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది పరిశీలిస్తున్నారు.
ఇళ్లు లేకపోయినా, నివాసం ఉండకపోయినా, అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అర్హులైనవారి దరఖాస్తులనే ఓకే చేస్తున్నారు. వేరే ప్రాంతంలో ఓటు ఉండి, తిరిగి ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి రిజెక్టు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 12వేల దరఖాస్తులు మాత్రమే ఓకే అయ్యాయి. ఈ నెల 14 వరకు దరఖాస్తులు పరిశీలించి తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. కాగా, మునుగోడులో అనర్హులు ఓటు నమోదు చేసుకున్నారని బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇంకా దీనిపై తీర్పు రావాల్సి ఉంది.