సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరేనని, ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారని ప్రస్తావించారు.
ముందుగా రాజగోపాల్‌రెడ్డి కుటుంబం గురించి తెలుసుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి టీఆర్‌ఎస్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఫాంహౌజ్ నుంచి మారుమూల లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిదేనని అన్నారు. కేసీఆర్‌కు సొంత విమానం కొనేంత డబ్బు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే గట్టుప్పల్ మండలం వచ్చిందన్న బండి సంజయ్.. ఆయన రాజీనామా తర్వాతే మునుగోడు అభివృద్ధి జరుగుతోందన్నారు. టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు
‘కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాం లో ఇరుక్కుంది నిజం కాదా? దమ్ముంటే కేసీఆర్ చర్చకు సిద్ధమా. ఓటుకు నలభై వేలు ఖర్చు చేసి కొనుగోలు కార్యక్రమానికి టీఆర్ఎస్ తెరలేపింది. టీఆర్‌ఎస్ పంచుతున్న డబ్బులు మనవే. అవి తీసుకుని బీజేపీకి ఓటు వేయండి. చండూరు రావాలంటే రెండు గంటలు పట్టింది. అందరి చేతుల్లో జెండా కనిపిస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో మాత్రం మందు గ్లాసులు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నారు. సింహం ఒక్కడే పోటీ చేస్తున్నాడు. గుంపులుగా ఎన్ని కలిసి వచ్చిన గెలిచేది బీజేపీనే. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ లలో ఇచ్చిన హామీలు ఒక్కటన్నా అమలు చేశారా. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు
Comments
Please login to add a commentAdd a comment