బీజేపీలో చేరిన మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి
సాక్షి, ఘట్‌కేసర్: మేడ్చల్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు ఘట్‌కేసర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం అవుషాపూర్‌లోని ఎంపీపీ నివాసంలో చర్చలు జరిపారు.
వారం రోజుల్లో మండలంలో సమావేశం నిర్వహించి అవుషాపూర్ సర్పంచ్ కావేరి మశ్చేందర్‌రెడ్డితో పాటు పలువురితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధుల విడుదల చేయాలని అధికార పార్టీ ఎంపీపీగా ఉండి గత కొంత కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. టీఆర్‌ఎస్ పాలనపై పలుమార్లు ఆసంతృప్తిని వ్యక్తం చేసిన, నిధులు కోసం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కలెక్టర్లను కోరినా నిధులు ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు ఎంపీపీ ప్రకటించారు.
సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల
సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కష్టపడి గెలిచిన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు కూడా ప్రజల ఓట్లతోనే గెలిచారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఘట్‌కేస్‌ర్ మండలం అవుషాపూర్‌లోని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలకు తప్ప ఎవరికి అధికారాలు లేవన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధులు బానిసత్వంలో ఇంకా మగ్గకుండ గౌరవం కోసం ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ కరిగిపోతున్న పార్టీ అని యూపీలోనే రాహుల్ గాంధీ ఓడిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల వెంట నడుస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు హనుమాన్, మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు..
గ్రామానికి రూ. కోటి చొప్పున నిధులిస్తే రాజీనామా చేస్తానన్నది వాస్తవమేనైనా, నిధులు ఇవ్వనందున ప్రస్తుతం ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘట్‌కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం అవుషాపూర్‌లో ఎంపీపీ మాట్లాడుతూ నిధుల కోసం మూడేళ్లుగా పోరాటం చేసిన మంత్రులు, అధికారులు స్పందించలేదన్నారు. పాత ప్రొసీడింగ్స్‌తో పనులు చేయిస్తే రాజీనామా చేస్తానన్నది నిజమేనన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కోరినా ఎవరూ స్పందించలేదన్నారు. అందువల్లే ఎంపీపీ పదవికి రాజీనామా చేసేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment