సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓటమి తప్పదని తెలిసి టీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫామ్‌హౌజ్ ఘటన టీఆర్‌ఎస్ కుట్రగా వర్ణించారు. ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చరిత్ర టీఆర్‌ఎస్‌దేనని మండిపడ్డారు. ఫిరాయింపులకు పెద్ద పీట వేసింది కేసీఆర్.. ఫిరాయించిన వారికి మంత్రి పదవులిచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. నైతిక విలువలు లేకుండా అనేకమందిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు.
తాము బ్రోకరిజం చేశామంటున్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఏ పార్టీ నుంచి గెలిచారో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. మండలిలోని మొత్తం కాంగ్రెస్ నేతల్ని టీఆర్‌ఎస్ తమ పార్టీలోకి లాక్కుందని ప్రస్తావించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారని, ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను చేర్చుకోలేదా అని నిలదీశారు. అక్రమ కేసులు, రాజకీయ బెదిరింపులతో చేర్చుకున్నారని మండిపడ్డారు. తమకు ఆ అవసరం లేదని, 2023 వరకూ తాము వేచిచూడటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
చదవండి: ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్
బీజేపీకి సంబంధం ఏమిటి
‘కల్వకుంట్ల కుటుంబం నుంచి సీఎం పదవి చేజారిపోతుందని భయం. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారని భయం. ఫామ్‌హౌజ్‌కు పోలీసులు రాకముందే టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కోసం పోస్టులు సిద్ధం మునుగోడులో బీజేపీ నేతలకు కేటీఆర్ ఫోన్ చేస్తే అది నైతికత. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఫామ్‌హౌజ్ ఘటనలో దొరికిన డబ్బులెంత? ఇప్పుడా డబ్బులు ఎటు పోయాయి. డబ్బుతో పట్టుకున్నామని చెబుతున్న వాళ్లతో బీజేపీకి సంబంధం ఏమిటి? నలుగురు ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా. వాళ్లేమైనా ప్రజాబలం ఉన్న నాయకులా. కొంతమంది పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టాలంటే మొదటి కేసు కేసీఆర్ పైనే పెట్టాలి. ఫామ్‌హౌజ్‌కు ఎందుకు పిలిచారు.
అప్పుడే మా పార్టీలోకి రానిస్తాం
వాళ్లకు వాళ్లే పిలుచుకున్నారు. వాళ్లకు వాళ్లు మొత్తం వ్యహారం నడిపించారు. దమ్ముంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. ఇది ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉన్న కేసు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో సానుభూతి కోసం ప్రయత్నాలు. ప్రధానిని తిడితేనే జాతీయ నేత అతవుతామని కేసీఆర్ భావిస్తున్నారు. 8 సంవత్సరాలలో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ. నాలుగు ఆర్‌లు మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే మా పార్టీలోకి రానిస్తాం. టీఆర్‌ఎస్ నేతలు చాలా మందితో నందకుమార్ ఫోటోలు దిగారు. నాతో దిగిన ఫోటో చూపించి కిషన్ రెడ్డి మనిషి అంటే ఎలా;’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి?
Comments
Please login to add a commentAdd a comment