
బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. బ్యాంకులు తమ స్వల్పకాలిక గోల్డ్ డిపాజిట్ పథకాలను (1-3 సంవత్సరాలు) కొనసాగించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.
పసిడి దిగుమతులపై దేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.. గృహాలు, సంస్థలు తమ బంగారాన్ని ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 2015 సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నవంబర్ 2024 వరకు 31,164 కేజీల బంగారాన్ని సమీకరించారు.
నిజానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. అవి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు), మిడ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (5-7 సంవత్సరాలు), లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (12-15 సంవత్సరాలు).
బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం తన మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిపాజిట్లను నిలిపివేయాలని నిర్దారించింది. షార్ట్ టర్మ్ డిపాజిట్ల విషయాన్ని నిర్వహించడం లేదా నిర్వహించకపోవడం అనేది పూర్తిగా బ్యాంకులే నిర్ణయించుకునేలా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీ
నవంబర్ 2024 వరకు సమీకరించిన మొత్తం 31,164 కిలోల బంగారంలో.. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ కింద 7,509 కేజీలు, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్స్ కింద వరుసగా 9728 కేజీలు, 13926 కేజీల బంగారం ఉంది. కాగా జీఎమ్ఎస్ పథకంలో ఉన్న డిపాజిటర్ల సంఖ్య 5693 మంది.