Gold Scheme
-
వీళ్లు మామూలోళ్లు కాదు.. నకిలీ బంగారం కుదువపెట్టి లోన్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖైరతాబాద్ బ్రాంచ్‌లో ‘పసిడి కుంభకోణం’ చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి 27 మంది గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారిక అప్రైజర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులు సహకరించారు. బ్యాంక్ ఉన్నతాధికారులు శనివారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దరఖాస్తుదారులతో కలిసి పథక రచన.. అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన డి.భానుచందర్ ఖైరతాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు అధికారిక అప్రైజర్‌గా పని చేస్తున్నారు. కుదువపెట్టడానికి వచి్చన బంగారాన్ని పరిశీలించే ఈయన దాని నాణ్యత, బరువు తదితరాలను నిర్ధారిస్తారు. వీటి ఆధారంగానే బ్యాంకు అధికారులు దరఖాస్తుదారుకు రుణం మంజూరు చేస్తారు. తార్నాకకు చెందిన మహ్మద్ కలీం బేగ్, అలీజాపూర్కు చెందిన ఆరిఫ్ అహ్మద్ సయీద్ ఇదే బ్యాంకులో రుణాల మంజూరు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురూ సూత్రధారులుగా కొందరు కస్టమర్లు, గోల్డ్‌లోన్ దరఖాస్తుదారులతో కలిసి భారీ స్కెచ్ వేశారు. నకిలీ బంగారు ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు. బంగారం నాణ్యతను భానుచందర్ ధ్రువీకరించగా.. మిగిలిన ఇద్దరూ ఆ లోన్లు ప్రాసెస్ చేశారు. ఇలా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య మొత్తం 27 మంది 44 గోల్డ్‌లోన్స్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతం అసలు–వడ్డీతో కలిపి రూ.4.51 కోట్లకు చేరింది. ఈ ఏడాది జూలై 26న కలీం బేగ్ ఖైరతాబాద్‌లోని క్రెడిట్ డిపార్ట్మెంట్ నుంచి సిద్దిపేట బ్రాంచ్‌కు మేనేజర్‌గా బదిలీ అయ్యారు. అక్కడ ఆగస్టు 14–20 తేదీల మధ్యలో వహీదాభాను, హమీద్ సయీద్, సయ్యద్ ఖాదర్, షేక్ రేష్మా పేర్లతో అయిదు గోల్డ్లోన్లు మంజూరు చేశారు. వీరు కుదువపెట్టిన బంగారం నాణ్యత, బరువులను భానుచందర్ ధ్రువీకరించారు. అప్పు తీసుకున్న వాళ్లు, బంగారం నాణ్యతను ఖరారు చేసిన అప్రైజర్ హైదరాబాద్‌కు చెందిన వాళ్లు కావడం, సిద్దిపేట వరకు వచ్చి రుణం తీసుకోవడం, గతంలో కలీం బేగ్ హైదరాబాద్‌లో పని చేసి ఉండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు అనుమానించారు. వెలుగు చూసిందిలా.. అదే బ్యాంక్‌నకు చెందిన మరో అప్రైజర్‌తో అయిదు లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారానికి పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో అది నకిలీ బంగారంగా బయటపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే కలీం బేగ్ రుణాలు చెల్లించి, లోన్ ఖాతాలు క్లోజ్ చేయడంతో బ్యాంకునకు ఎలాంటి ఆర్థిక నష్టం రాలేదు. భానుచందర్‌తో పాటు కలీం బేగ్ వ్యవహారాలను అనుమానించిన అధికారులు ఖైరతాబాద్ బ్రాంచ్ నుంచి ఇటీవల కాలంలో మంజూరైన గోల్డ్లోన్లపై దృష్టి పెట్టారు. వేరే అప్రైజర్లతో తనిఖీలు చేయించగా... 44 గోల్డ్‌లోన్లకు సంబంధించి 27 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నకిలీదిగా తేలింది. ఖైరతాబాద్, బషీర్‌బాగ్ బ్రాంచ్‌ల నుంచి వీళ్లు తీసుకున్న రుణం, దాని వడ్డీ రూ.4.51 కోట్లుగా లెక్కతేలింది. ఖైరతాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె.బాలగోపాలన్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే...
బంగారం ఆర్థికంగా ఆపదలో ఆదుకుంటుందని అందరూ చెబుతారు. అవసరాలకు డబ్బు అందనపుడు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి అప్పు తెస్తుంటారు. ప్రైవేటు వ్యాపారులు, ఎన్బీఎఫ్సీలు, ప్రభుత్వ బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటాయి. అయితే ఇతర సంస్థలు కంటే ప్రభుత్వరంగ బ్యాంకులు బంగారం తనఖాపై తక్కువే రుణం ఇస్తుంటాయి. అయినా తమ సొమ్మకు భరోసా ఉంటుందని భావించి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. సదరు బ్యాంకులో దురదృష్టవశాత్తు నగలు ఎవరైనా దొంగలిస్తే తనఖాపెట్టిన బంగారానికి గ్యారెంటీ ఎవరనే ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఓ బ్యాంకు అధికారి ఇలా తనఖా పెడుతున్న బంగారానికి సంబంధించి భద్రత ఎవరిపై ఉంటుందనే అంశాలను వెల్లడించారు. తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందకూడదన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు అధికారులు ‘సేఫ్’లో భద్రపరుస్తారు. బ్యాంకుశాఖలోని ఎకౌంటెంట్‌తో పాటు క్యాష్ ఇన్‌ఛార్జి (క్లర్క్) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు. ఈ సేఫ్ తాళాలు ఇద్దరి దగ్గరే ఉంటాయి. ఒకరిని గుడ్డిగా నమ్మి, వేరొకరు ఇతరులకు తాళాన్ని ఇస్తే తప్పా సొత్తును అపహరించడం కష్టం. ఇదీ చదవండి: భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..! బ్యాంకు శాఖల్లో ఆడిట్ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు. కొందరు రుణం తీర్చేసినప్పుడు వారికి ఆభరణాలు ఇచ్చేసినా.. పొరపాటున సేఫ్‌లోనూ ఉన్నట్లు అధికారులు రాసుకుంటారని పదవీవిరమణ చేసిన మరో బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. ఏదైనా కారణాలతో బ్యాంకులోని బంగారం కనిపంచకుండాపోతే రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందొచ్చని తెలిపారు. ఉదాహరణకు 100 గ్రాముల ఆభరణం తనఖా పెడితే, 98 గ్రాములను పరిగణనలోకి తీసుకుని.. దానికి సరిపడా బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు ఖాతాదార్లకు ఉంటుంది. తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారని సీనియర్ అధికారి వివరించారు. -
తాజా గోల్డ్ బాండ్ @ రూ. 5926
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023–24 తొలి విడత సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. బంగారం జారీ ధరను గ్రాముకు రూ.5,926గా ఆర్థికశాఖ ప్రకటించింది. ఐదు రోజుల పాటు (19–23) స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ప్రకటిత ధరలో గ్రాముకు రూ.50 రిబేట్ లభిస్తుంది. అంటే ఆన్లైన్ ధర గ్రాముకు రూ.5,876గా ఉంటుందన్నమాట. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్ 19తో పాటు సెప్టెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ కూడా మరో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో ఉండే సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీమ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయొ చ్చు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసి యేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సగ టు ధర ఆధారంగా ఎస్జీబీ ధరను నిర్ణయిస్తారు. -
ద్వారక తిరుమలలో బోర్డు తిప్పేసిన గోల్డ్ వ్యాపారి
-
గోల్డ్ స్కీమ్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనం వెలికితీసేందుకు గతంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) స్కీమ్ తరహాలో వ్యక్తుల వద్ద పరిమితికి మించి పోగుపడిన బంగారాన్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించే పథకాన్ని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెడుతుందని వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యక్తులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను స్వచ్ఛందంగా ప్రకటించే ఆమ్నెస్టీ స్కీమ్ వంటిదేమీ తమ ప్రతిపాదనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ సన్నాహక ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో ఇలాంటి వార్తలు రావడం సాధారణమేనని కొట్టిపారేసింది. కాగా బంగారంపై నియంత్రణలు విధిస్తూ పరిమితికి మించిన బంగారం ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించే పథకం త్వరలో ఖరారు కానుందని, గోల్డ్ బోర్డ్ ఏర్పాటవుతుందని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. రసీదులు లేకుండా కొనుగోలు చేసిన బంగారం విలువ మొత్తంపై పన్ను విధింపుపై కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. చదవండి : బంగారం ఎక్కువైతే... ఇత్తడైపోద్ది!! -
మంత్లీ గోల్డ్ స్కీం కొంప ముంచింది
సాక్షి, ముంబై : ముంబైలోని గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ వందలాది మధ్య తరగతి ప్రజలను (పెట్టుబడిదారులను) నిలువునా ముంచేసింది. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి, పెద్ద మొత్తంలో నగదును సేకరించి, సరిగ్గా ఆ నగదును తిరిగి చెల్లించాల్సిన సమయానికి పత్తాలేకుండా పోయారు. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. నెలవారీ పెట్టుబడి పథకంలో భాగంగా గుడ్విన్ ఆభరణాల దుకాణంలో డబ్బు పెట్టినట్లు పెట్టుబడిదారులు తెలిపారు. సరితా అంగ్రే (38) డొంబివాలిలోని గుడ్విన్ సంస్థలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. దాచుకున్నడబ్బులు దీపావళి నాటికి అక్కరకొస్తాయని ఆమె ఆశించారు. అక్టోబర్ 21 నాటికి ఈ సొమ్మను తిరిగి పొందాల్సి ఉంది. కానీ షో రూం మూసివేసిన బోర్డు ఆమెను వెక్కిరించింది. అంతేకాదు ఇటీవల ప్రకంపనలు రేపిన పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో రూ. 5 లక్షలను పోగొట్టుకోవడం మరో విషాదం. మరో బాధితురాలు అనామిక శ్రీవాస్తవ (52) ది మరో గాధ. కూతురు పెళ్లి కోసం రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ సొమ్ముతో డిసెంబరులో జరగాల్సిన కుమార్తె పెళ్లికి నగలు కొనుక్కోవాలనుకున్నారు. ఇపుడు గుడ్విన్ సంస్థ బిచాణా ఎత్తేయడంతో ఏం చేయాలోఅర్థం కావడం లేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సంస్థలో పొదుపు చేసుకున్న సొమ్ముతో దీపావళికి నగలు కొనాలని ప్లాన్ చేసుకున్నామని మరొక కస్టమర్ సత్యం వెరా (38) వాపోయారు. తమ అక్టోబర్ 21 న మెచ్యూర్ అవుతుంది. దీంతో దుకాణానికి వెళితే షాప్ మూసినవేసిన బ్యానర్ తమను ఆందోళనలో పడవేసిందని తెలిపారు. తాము రూ .10 లక్షలు పెట్టుబడి పెట్టామని మరొక కస్టమర్ సెబాస్టియన్ డిసౌజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శని, ఆదివారాల్లో కస్టమర్లు దుకాణాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడవిన్ జ్యువెల్లరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. గుడ్విన్ గ్రూపు ఛైర్మన్ సుధీర్ కుమార్, సుధీష్ కుమార్, స్టోర్ మేనేజర్ మనీష్ కుండిపై డొంబివాలి పోలీసులుఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం కూడా ఆందోళనకు దిగిన బాధితులు పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యకం చేశారు. వారిని అరెస్టు చేయడం ఎందుకు అంత కష్టం? నిందితులు దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటూ మండిపడ్డారు. చదవండి : నమ్మించి ముంచేసిన జ్యువెల్లరీ సంస్థ -
జొమాటో జోరు : ఆదాయం మూడు రెట్లు జంప్
సాక్షి, ముంబై: ఉద్యోగాల కోతతో ఇటీవల వార్తల్లో నిలిచిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆదాయంలో దూసుకుపోతోంది. ఒకవైపు దేశమంతా ఆర్థిక మందగమనం పరిస్థితులు భయపెడుతోంటే.. మరోవైపు జొమాటో మాత్రం రాకెట్ వేగంతోగణనీయమమైనవృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తోలి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) తన ఆదాయంలో ఏకంగా మూడు రెట్లు వృద్ధి రేటును నమోదు చేసింది. ఏప్రిల్-సెప్టెంబర్ 2019 అర్ధ సంవత్సర కాలంలో కంపెనీ రూ 1,458 కోట్ల( 205 మిలియన్ డాలర్ల) ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో జొమాటో ఆదాయం కేవలం రూ 448 కోట్లు మాత్రమే. ఈలెక్కల్ని జొమాటో వ్యవస్థాపక సీఈఓ దీపిందర్ గోయెల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే కంపెనీ నెలవారీ బర్నింగ్ రేటు (నష్టాలు) కూడా 60శాతం మేరకు తగ్గినట్లు గోయెల్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడంతో అద్భుతమైన ఫలితాలను సాధించామని పేర్కొన్నారు. ప్రధానంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) లాగ్అవుట్ ప్రచారం ఉన్నప్పటికీ డైన్-అవుట్ రెస్టారెంట్లు తమ జొమాటో గోల్డ్ పథకానికి మంచి ఆదరణ లభించిందని వెల్లడించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో జరిగిన నష్టాల గురించి కంపెనీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. జొమాటో దేశంలోని 500 నగరాలూ, పట్టణాల్లో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోందని గోయల్ తెలిపారు. దేశవ్యాప్తంగా సహకార మార్జిన్ సానుకూలంగా ఉన్నాయన్నారు. టాప్ 15 నగరాల్లో కంపెనీ ఆర్డర్లు గత 12 నెలల్లో రెట్టింపు అయ్యాయి. మిగిలిన నగరాలు ఇప్పటికే ఆర్డర్ వాల్యూమ్లకు 35 శాతం దోహదం చేశాయని గోయల్ చెప్పారు. గతేడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 200 నగరాలూ, పట్టణాల్లో ఉండేది. ఇలా భారీగా విస్తరించటంతో ఆదాయాల్లో అధిక వృద్ధి సాధ్యం అవుతోందన్నారు. ఆగస్టు 15 తరువాతనుంచి భారతదేశంలో 6,300 రెస్టారెంట్లు జోమాటో గోల్డ్‌లో ఉన్నాయనీ, వీటితో పాటు, ఇటీవల ప్రారంభించిన జోమాటో గోల్డ్‌లో డెలివరీ కోసం 10,000 రెస్టారెంట్లు కలిసాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా జొమాటో సుమారు 540 మంది ఉద్యోగులకు ఇటీవలే ఉద్వాసన పలికింది. టెక్నాలజీ అభివృద్ధి చేయడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి సరి కొత్త టెక్నాలజీ వాడకం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించింది. అలాగే అనేక ప్లాన్లు తమ బిజినెస్ మోడల్ కు విరుద్ధంగా ఉన్నాయని రెస్టారెంట్ల యజమానులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జోమాటో గోల్డ్‌తో పటిష్టంగా ఉన్నామని జొమాటో నమ్ముతున్నప్పటికీ ఇది ఆమోదయోగ్యంకాని ప్రతిపాదన అని ఎన్ఆర్ఏఐ వ్యాఖ్యానించింది. -
గోల్డ్ స్కీం పేరుతో ఓ ప్రైవేటు బ్యాంకు ఎండీ..
సాక్షి, ఆదోని(కర్నూలు) : గోల్డ్ స్కీం పేరుతో డిపాజిటర్లను మోసం చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఎండీని టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలు డీఎస్పీ వెంకటరాముడు.. సీఐ భాస్కర్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనహాల్ గ్రామానికి చెందిన ముళ్లపూడి ఇసాక్ గత జనవరిలో పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో జాన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, జాన్ ఫైనాన్స్ అండ్ జ్యువెలరీ స్కీం కార్యాలయాన్ని ప్రారంభించారు. 14 మందిని ఫీల్డ్ ఆఫీసర్లుగా నియమించుకొని 282 మంది సభ్యులను చేర్చుకున్నాడు. వారి వద్ద నుంచి డిపాజిట్ రూపంలో దాదాపు రూ.30 లక్షలు సేకరించాడు. గడువు ముగిసినా లోన్లు, బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడంతో ఎండీ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీరామనగర్‌కు చెందిన బాధితుడు దేవప్రసాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గత మే 10న ఫిర్యాదు చేశాడు. దేవప్రసాద్‌తో పాటు మరికొంతమంది బాధితులు రాఘవేంద్రమ్మ, లక్ష్మీ, గౌస్, జాఫర్, రఫీక్ కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా శనివారం ఎండీ ముళ్లపూడి ఇసాక్ కల్లుబావిలోని ఆటో స్టాండ్ వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో భార్య రెబెకాకు రూ.23 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని, ఆమె కోసం గాలిస్తున్నామని, త్వరలోనే నగదు రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా ఎమ్మిగనూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి బాధితుల నుంచి రూ.20 లక్షల వరకు డిపాజిట్లు వసూలు చేసి ముఖం చాటేశాడని డీఎస్పీ చెప్పారు. 2014లోనూ దొంగనోట్ల కేసులో గంగావతి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. -
బోర్డు తిప్పేసిన ‘జాన్’
కర్నూలు, ఆదోని టౌన్/అర్బన్: పట్టణంలోని ఎస్కేడీ కాలనీ 3వ రోడ్డులో ఉన్న జాన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతూ న్యాయం చేయాలని శుక్రవారం.. టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. టూ టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. జనవరి నెలలో జాన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, జాన్ ఫైనాన్స్ అండ్ జ్యూవెలర్స్ స్కీం కార్యాలయాన్ని ఆదోని పట్టణంలో ప్రారంభించారు. సంస్థలో రూ.1,150 చెల్లించి ఐదునెలల వ్యవధిలో 250 మంది సభ్యులుగా చేరారు. వీరిలో 34 మంది గోల్డ్ స్కీంలో డిపాజిట్ చేశారు. జాన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో 216 మంది నెల, వారాలు కంతులు చెల్లించారు. మొత్తం సుమారు రూ.అరకోటి దాకా వసూలు చేశారు. గడువు ముగిసినప్పటికీ ఆ సంస్థ నిర్వాహకులు బాధితులకు బంగారం కాని, లోన్ వసతి కాని కల్పించకపోవడంతో అనుమానం కలిగింది. పట్టణంలోని శ్రీరామ్ నగర్లో నివాసముంటున్న దేవప్రసాద్ ఆరుగురిని స్కీంలో చేర్పించాడు. రూ.లక్ష 44వేలు డిపాజిట్ చేశాడు. అయితే ఆ సంస్థ నుంచి తనకు రావాల్సిన బంగారం ఇవ్వకపోవడంతో అనుమానం కలిగింది. ఆ సంస్థ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లను నిలదీశాడు. అసలు నిజం బయటపడింది. తనలాగా ఎంతోమంది అమాయక ప్రజలు మోసపోయారని తెలుసుకున్న దేవప్రసాద్.. డిపాజిట్ దారులను పోగు చేశాడు. న్యాయం కోసం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం దాదాపు 50 మందికి పైగానే డిపాజిట్ దారులు సీఐ భాస్కర్, ఎస్ఐ జయశంకర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దేవప్రసాద్ ఫిర్యాదు మేరకు ఆ సంస్థ ఎండీ ఇసాక్, మేనేజర్ శ్రీవిద్య, ఫీల్డ్ ఆఫీసర్లు 10మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భాస్కర్ తెలిపారు. బాధితులు రాఘవేంద్రమ్మ, లక్ష్మి, గౌస్, జాఫర్, రఫీక్ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రూ.లక్షా 20వేలు చెల్లించా 5 తులాలు బంగారం కోసం రూ.లక్షా 20వేలు జాన్ ఫైనాన్స్ అండ్ జువెలర్స్‌లో ఫిబ్రవరి నెలలో డిపాజిట్ చేశాను. గడువు ముగిసింది. నాకు రావాల్సిన బంగారం ఇవ్వాలని అడిగితే సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాను. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి ప్రజలను రక్షించాలి.రాఘవేంద్రమ్మ, బాధితురాలు, అంబేడ్కర్‌నగర్ -
7.5 టన్నుల బంగారం గోల్డ్ మానిటైజేషన్ లోకి...
హైదరాబాద్: గోల్డ్ మానిటైజేషన్ పథకంలోకి శ్రీవారి బంగారాన్ని తీసుకురానున్నారు. మొత్తం 7.5 టన్నుల బంగారాన్ని ఈ స్కీంలో పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1.3 టన్నుల బంగారాన్ని టీటీడీ ఉంచింది. వివిధ పథకాల కింద నిల్వ ఉంచిన బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకం కిందకి తీసుకురావాలని ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. ఇలా చేయడం వల్ల వడ్డీ రూపంలో మరికొంత బంగారం వస్తుందని టీటీడీ బోర్డు భావిస్తోంది. అయితే వడ్డీని బంగారం రూపంలో చెల్లించాలని బోర్డు కోరనుంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రూపాల్లో బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో వినియోగంలోకి తీసుకరానున్నారు. -
గోల్డ్‌స్కీం పేరుతో రూ.కోటి కొట్టేశాడు
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. స్కీం పూర్తి కావటంతో చందాదారులకు రూ.కోటి చెల్లించాల్సి ఉండగా బోర్డు తిప్పేసి నిర్వాహకుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... బద్వేలుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(27) 'ఆఫ్రిది జుయెలరీ' షాపు యజమాని. 2013లో అతడు 'ఆఫ్రిది మెగా గోల్డ్ బంపర్ స్కీం' పేరుతో ఓ గోల్డ్‌స్కీం మొదలుపెట్టాడు. ఈ స్కీంలో నెలకు రూ.1500 చొప్పున 24 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఇందులో 300 మంది సభ్యులుగా చేరారు. ఈనెల 10వ తేదీకి చివరి వాయిదా కూడా పూర్తయింది. దీంతో ప్రతీ నెలా సరిగా డబ్బు చెల్లించని 24 మందికి మినహాయించి, 276 మందికి రూ.36 వేలు వంతున రూ.కోటి మేర పంపిణీ చేయాల్సి ఉంది. అయితే బాషా గత పది రోజులుగా అందుబాటులో లేకుండా పోయాడు. అతడు పరారైనట్లు గుర్తించిన బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. -
గోల్డ్‌స్కీం పేరుతో రూ.కోటి టోకరా
బద్వేలు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం సిద్దవటం రోడ్డులోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. స్కీం చివరి వాయిదా పూర్తి కావటంతో చందాదారులకు రూ.కోటి చెల్లించాల్సి ఉండగా బోర్డు తిప్పేసి నిర్వాహకుడు పరారయ్యాడు. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా(27) ఆఫ్రిది జువెలరీ ఏర్పాటు చేశాడు. 2013లో అతడు ఆఫ్రిది మెగా గోల్డ్ బంపర్ స్కీం మొదలుపెట్టాడు. ఈస్కీంలో నెలకు రూ.1500 చొప్పున 24 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఇందులో 300 మంది సభ్యులుగా చేరారు. ఈనెల 10వ తేదీకి చివరి వాయిదా కూడా పూర్తయింది. దీంతో సరిగా చెల్లించని 24 మందికి మినహాయించి 276 మందికి రూ.36 వేలు వంతున రూ.కోటి మేర పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే బాషా పది రోజులుగా అందుబాటులో లేకుండా పోయాడు. అతడు పరారైనట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
శిల్పాశెట్టి గోల్డ్ స్కీమ్..
బాలీవుడ్ తార శిల్పాశెట్టికి చెందిన సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్‌లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుంది. కస్టమరు వైదొలగాలనుకున్నప్పుడు చివర్లో జమయిన మొత్తానికి సంబంధించి ఆభరణాలు లేదా 24 క్యారట్ల స్వచ్ఛత గల బంగారు నాణేలు (1 గ్రా. నుంచి 50 గ్రాముల దాకా) పొందవచ్చు. బంగారం రేట్లు తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ ధర పెట్టి కొని నష్టపోకుండా ఉండేందుకు, పసిడిలో ఇన్వెస్ట్మెంట్ అలవాటును ప్రోత్సహించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందంటోంది కంపెనీ. ప్రత్యేకంగా లాకిన్ వ్యవధి గానీ, స్టోరేజీ చార్జీలు గానీ, ఇతరత్రా చార్జీలు గానీ ఉండవంటోంది. ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్, కార్వీ కంప్యూటర్షేర్ సంస్థల తోడ్పాటు ఉండటం వల్ల పెట్టుబడులకు ఢోకా ఉండదంటూ సత్యుగ్ గోల్డ్ చెబుతోంది. షరా మామూలుగా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లాగే దీని గురించి కూలంకషంగా సందేహాలన్నీ తీర్చుకుని ఇన్వెస్ట్ చేయవచ్చన్నది నిపుణుల సలహా.