సాక్షి, ముంబై : ముంబైలోని గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ వందలాది మధ్య తరగతి ప్రజలను (పెట్టుబడిదారులను) నిలువునా ముంచేసింది. మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి, పెద్ద మొత్తంలో నగదును సేకరించి, సరిగ్గా ఆ నగదును తిరిగి చెల్లించాల్సిన సమయానికి పత్తాలేకుండా పోయారు. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
నెలవారీ పెట్టుబడి పథకంలో భాగంగా గుడ్‌విన్ ఆభరణాల దుకాణంలో డబ్బు పెట్టినట్లు పెట్టుబడిదారులు తెలిపారు. సరితా అంగ్రే (38) డొంబివాలిలోని గుడ్‌విన్ సంస్థలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. దాచుకున్నడబ్బులు దీపావళి నాటికి అక్కరకొస్తాయని ఆమె ఆశించారు. అక్టోబర్ 21 నాటికి ఈ సొమ్మను తిరిగి పొందాల్సి ఉంది. కానీ షో రూం మూసివేసిన బోర్డు ఆమెను వెక్కిరించింది. అంతేకాదు ఇటీవల ప్రకంపనలు రేపిన పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో రూ. 5 లక్షలను పోగొట్టుకోవడం మరో విషాదం.
మరో బాధితురాలు అనామిక శ్రీవాస్తవ (52) ది మరో గాధ. కూతురు పెళ్లి కోసం రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ సొమ్ముతో డిసెంబరులో జరగాల్సిన కుమార్తె పెళ్లికి నగలు కొనుక్కోవాలనుకున్నారు. ఇపుడు గుడ్‌విన్ సంస్థ బిచాణా ఎత్తేయడంతో ఏం చేయాలోఅర్థం కావడం లేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సంస్థలో పొదుపు చేసుకున్న సొమ్ముతో దీపావళికి నగలు కొనాలని ప్లాన్ చేసుకున్నామని మరొక కస్టమర్ సత్యం వెరా (38) వాపోయారు. తమ అక్టోబర్ 21 న మెచ్యూర్ అవుతుంది. దీంతో దుకాణానికి వెళితే షాప్ మూసినవేసిన బ్యానర్ తమను ఆందోళనలో పడవేసిందని తెలిపారు. తాము రూ .10 లక్షలు పెట్టుబడి పెట్టామని మరొక కస్టమర్ సెబాస్టియన్ డిసౌజా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శని, ఆదివారాల్లో కస‍్టమర్లు దుకాణాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడవిన్ జ్యువెల్లరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. గుడ్‌విన్ గ్రూపు ఛైర్మన్ సుధీర్ కుమార్, సుధీష్ కుమార్, స్టోర్ మేనేజర్ మనీష్ కుండిపై డొంబివాలి పోలీసులుఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం కూడా ఆందోళనకు దిగిన బాధితులు పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యకం చేశారు. వారిని అరెస్టు చేయడం ఎందుకు అంత కష్టం? నిందితులు దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటూ మండిపడ్డారు.
చదవండి : నమ్మించి ముంచేసిన జ్యువెల్లరీ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment