బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.4.51 కోట్లకు టోకరా
నకిలీ బంగారం కుదువపెట్టి రుణాలు పొందిన 27 మంది
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖైరతాబాద్ బ్రాంచ్‌లో ‘పసిడి కుంభకోణం’ చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి 27 మంది గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారిక అప్రైజర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులు సహకరించారు. బ్యాంక్ ఉన్నతాధికారులు శనివారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి..
దరఖాస్తుదారులతో కలిసి పథక రచన..
అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన డి.భానుచందర్ ఖైరతాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు అధికారిక అప్రైజర్‌గా పని చేస్తున్నారు. కుదువపెట్టడానికి వచి్చన బంగారాన్ని పరిశీలించే ఈయన దాని నాణ్యత, బరువు తదితరాలను నిర్ధారిస్తారు. వీటి ఆధారంగానే బ్యాంకు అధికారులు దరఖాస్తుదారుకు రుణం మంజూరు చేస్తారు. తార్నాకకు చెందిన మహ్మద్ కలీం బేగ్, అలీజాపూర్‌కు చెందిన ఆరిఫ్ అహ్మద్ సయీద్ ఇదే బ్యాంకులో రుణాల మంజూరు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురూ సూత్రధారులుగా కొందరు కస్టమర్లు, గోల్డ్‌లోన్ దరఖాస్తుదారులతో కలిసి భారీ స్కెచ్ వేశారు. నకిలీ బంగారు ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు.
బంగారం నాణ్యతను భానుచందర్ ధ్రువీకరించగా.. మిగిలిన ఇద్దరూ ఆ లోన్లు ప్రాసెస్ చేశారు. ఇలా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య మొత్తం 27 మంది 44 గోల్డ్‌లోన్స్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతం అసలు–వడ్డీతో కలిపి రూ.4.51 కోట్లకు చేరింది. ఈ ఏడాది జూలై 26న కలీం బేగ్ ఖైరతాబాద్‌లోని క్రెడిట్ డిపార్ట్‌మెంట్ నుంచి సిద్దిపేట బ్రాంచ్‌కు మేనేజర్‌గా బదిలీ అయ్యారు. అక్కడ ఆగస్టు 14–20 తేదీల మధ్యలో వహీదాభాను, హమీద్ సయీద్, సయ్యద్ ఖాదర్, షేక్ రేష్మా పేర్లతో అయిదు గోల్డ్‌లోన్లు మంజూరు చేశారు. వీరు కుదువపెట్టిన బంగారం నాణ్యత, బరువులను భానుచందర్ ధ్రువీకరించారు. అప్పు తీసుకున్న వాళ్లు, బంగారం నాణ్యతను ఖరారు చేసిన అప్రైజర్ హైదరాబాద్‌కు చెందిన వాళ్లు కావడం, సిద్దిపేట వరకు వచ్చి రుణం తీసుకోవడం, గతంలో కలీం బేగ్ హైదరాబాద్‌లో పని చేసి ఉండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు అనుమానించారు.
వెలుగు చూసిందిలా..
అదే బ్యాంక్‌నకు చెందిన మరో అప్రైజర్‌తో అయిదు లోన్ ఖాతాలకు సంబంధించిన బంగారానికి పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో అది నకిలీ బంగారంగా బయటపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే కలీం బేగ్ రుణాలు చెల్లించి, లోన్ ఖాతాలు క్లోజ్ చేయడంతో బ్యాంకునకు ఎలాంటి ఆర్థిక నష్టం రాలేదు. భానుచందర్‌తో పాటు కలీం బేగ్ వ్యవహారాలను అనుమానించిన అధికారులు ఖైరతాబాద్ బ్రాంచ్ నుంచి ఇటీవల కాలంలో మంజూరైన గోల్డ్‌లోన్లపై దృష్టి పెట్టారు. వేరే అప్రైజర్లతో తనిఖీలు చేయించగా... 44 గోల్డ్‌లోన్లకు సంబంధించి 27 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నకిలీదిగా తేలింది. ఖైరతాబాద్, బషీర్‌బాగ్ బ్రాంచ్‌ల నుంచి వీళ్లు తీసుకున్న రుణం, దాని వడ్డీ రూ.4.51 కోట్లుగా లెక్కతేలింది. ఖైరతాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె.బాలగోపాలన్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment