ఆదోని టూ టౌన్ ఎస్‌ఐకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు
కర్నూలు, ఆదోని టౌన్/అర్బన్: పట్టణంలోని ఎస్కేడీ కాలనీ 3వ రోడ్డులో ఉన్న జాన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతూ న్యాయం చేయాలని శుక్రవారం.. టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. టూ టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. జనవరి నెలలో జాన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, జాన్ ఫైనాన్స్ అండ్ జ్యూవెలర్స్ స్కీం కార్యాలయాన్ని ఆదోని పట్టణంలో ప్రారంభించారు. సంస్థలో రూ.1,150 చెల్లించి ఐదునెలల వ్యవధిలో 250 మంది సభ్యులుగా చేరారు. వీరిలో 34 మంది గోల్డ్ స్కీంలో డిపాజిట్ చేశారు. జాన్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో 216 మంది నెల, వారాలు కంతులు చెల్లించారు. మొత్తం సుమారు రూ.అరకోటి దాకా వసూలు చేశారు.
గడువు ముగిసినప్పటికీ ఆ సంస్థ నిర్వాహకులు బాధితులకు బంగారం కాని, లోన్ వసతి కాని కల్పించకపోవడంతో అనుమానం కలిగింది. పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో నివాసముంటున్న దేవప్రసాద్ ఆరుగురిని స్కీంలో చేర్పించాడు. రూ.లక్ష 44వేలు డిపాజిట్ చేశాడు. అయితే ఆ సంస్థ నుంచి తనకు రావాల్సిన బంగారం ఇవ్వకపోవడంతో అనుమానం కలిగింది. ఆ సంస్థ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లను నిలదీశాడు. అసలు నిజం బయటపడింది. తనలాగా ఎంతోమంది అమాయక ప్రజలు మోసపోయారని తెలుసుకున్న దేవప్రసాద్.. డిపాజిట్ దారులను పోగు చేశాడు. న్యాయం కోసం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం దాదాపు 50 మందికి పైగానే డిపాజిట్ దారులు సీఐ భాస్కర్, ఎస్‌ఐ జయశంకర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దేవప్రసాద్ ఫిర్యాదు మేరకు ఆ సంస్థ ఎండీ ఇసాక్, మేనేజర్ శ్రీవిద్య, ఫీల్డ్ ఆఫీసర్లు 10మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భాస్కర్ తెలిపారు. బాధితులు రాఘవేంద్రమ్మ, లక్ష్మి, గౌస్, జాఫర్, రఫీక్ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
రూ.లక్షా 20వేలు చెల్లించా
5 తులాలు బంగారం కోసం రూ.లక్షా 20వేలు జాన్ ఫైనాన్స్ అండ్ జువెలర్స్‌లో ఫిబ్రవరి నెలలో డిపాజిట్ చేశాను. గడువు ముగిసింది. నాకు రావాల్సిన బంగారం ఇవ్వాలని అడిగితే సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాను. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి ప్రజలను రక్షించాలి.రాఘవేంద్రమ్మ, బాధితురాలు, అంబేడ్కర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment