వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు.
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. స్కీం పూర్తి కావటంతో చందాదారులకు రూ.కోటి చెల్లించాల్సి ఉండగా బోర్డు తిప్పేసి నిర్వాహకుడు పరారయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే... బద్వేలుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(27) 'ఆఫ్రిది జుయెలరీ' షాపు యజమాని. 2013లో అతడు 'ఆఫ్రిది మెగా గోల్డ్ బంపర్ స్కీం' పేరుతో ఓ గోల్డ్‌స్కీం మొదలుపెట్టాడు. ఈ స్కీంలో నెలకు రూ.1500 చొప్పున 24 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఇందులో 300 మంది సభ్యులుగా చేరారు. ఈనెల 10వ తేదీకి చివరి వాయిదా కూడా పూర్తయింది. దీంతో ప్రతీ నెలా సరిగా డబ్బు చెల్లించని 24 మందికి మినహాయించి, 276 మందికి రూ.36 వేలు వంతున రూ.కోటి మేర పంపిణీ చేయాల్సి ఉంది. అయితే బాషా గత పది రోజులుగా అందుబాటులో లేకుండా పోయాడు. అతడు పరారైనట్లు గుర్తించిన బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.