జొమాటో జోరు : ఆదాయం మూడు రెట్లు జంప్‌ | Zomato says despite logout campaign, more restaurants joining Gold programme | Sakshi
Sakshi News home page

జొమాటో జోరు : ఆదాయం మూడు రెట్లు జంప్‌

Published Wed, Oct 2 2019 11:55 AM | Last Updated on Wed, Oct 2 2019 11:57 AM

Zomato says despite logout campaign, more restaurants joining Gold programme - Sakshi

సాక్షి,  ముంబై:  ఉద్యోగాల  కోతతో ఇటీవల వార్తల్లో నిలిచిన ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆదాయంలో దూసుకుపోతోంది. ఒకవైపు దేశమంతా ఆర్థిక మందగమనం పరిస్థితులు భయపెడుతోంటే.. మరోవైపు జొమాటో మాత్రం  రాకెట్ వేగంతోగణనీయమమైనవృద్ధిని నమోదు చేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తోలి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) తన ఆదాయంలో ఏకంగా మూడు రెట్లు వృద్ధి రేటును నమోదు చేసింది.

ఏప్రిల్-సెప్టెంబర్ 2019 అర్ధ సంవత్సర కాలంలో కంపెనీ రూ 1,458 కోట్ల( 205 మిలియన్ డాలర్ల)  ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో జొమాటో ఆదాయం కేవలం రూ 448 కోట్లు మాత్రమే.  ఈలెక్కల్ని జొమాటో వ్యవస్థాపక సీఈఓ దీపిందర్ గోయెల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే  కంపెనీ నెలవారీ బర్నింగ్ రేటు (నష్టాలు) కూడా 60శాతం  మేరకు తగ్గినట్లు గోయెల్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడంతో అద్భుతమైన ఫలితాలను సాధించామని పేర్కొన్నారు.  ప్రధానంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ)  లాగ్అవుట్ ప్రచారం ఉన్నప్పటికీ డైన్-అవుట్ రెస్టారెంట్లు  తమ జొమాటో గోల్డ్‌ పథకానికి మంచి ఆదరణ లభించిందని వెల్లడించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో జరిగిన నష్టాల గురించి కంపెనీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.


జొమాటో దేశంలోని 500 నగరాలూ, పట్టణాల్లో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోందని  గోయల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా సహకార మార్జిన్ సానుకూలంగా ఉన్నాయన్నారు. టాప్ 15 నగరాల్లో కంపెనీ ఆర్డర్లు గత 12 నెలల్లో రెట్టింపు అయ్యాయి. మిగిలిన నగరాలు ఇప్పటికే ఆర్డర్ వాల్యూమ్లకు 35 శాతం దోహదం చేశాయని గోయల్ చెప్పారు. గతేడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 200 నగరాలూ, పట్టణాల్లో ఉండేది. ఇలా భారీగా విస్తరించటంతో ఆదాయాల్లో అధిక వృద్ధి సాధ్యం అవుతోందన్నారు. ఆగస్టు 15 తరువాతనుంచి భారతదేశంలో 6,300 రెస్టారెంట్లు జోమాటో గోల్డ్‌లో ఉన్నాయనీ,  వీటితో పాటు, ఇటీవల ప్రారంభించిన జోమాటో గోల్డ్‌లో డెలివరీ కోసం 10,000 రెస్టారెంట్లు  కలిసాయని  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

కాగా జొమాటో సుమారు 540 మంది ఉద్యోగులకు ఇటీవలే ఉద్వాసన పలికింది. టెక్నాలజీ అభివృద్ధి చేయడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి సరి కొత్త టెక్నాలజీ వాడకం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించింది. అలాగే అనేక ప్లాన్లు తమ బిజినెస్ మోడల్ కు విరుద్ధంగా ఉన్నాయని రెస్టారెంట్ల యజమానులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.  మరోవైపు జోమాటో గోల్డ్‌తో పటిష్టంగా  ఉన్నామని  జొమాటో నమ్ముతున‍్నప్పటికీ ఇది   ఆమోదయోగ్యంకాని ప్రతిపాదన అని  ఎన్‌ఆర్‌ఏఐ వ్యాఖ్యానించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement