సాక్షి, ఆదోని(కర్నూలు) : గోల్డ్ స్కీం పేరుతో డిపాజిటర్లను మోసం చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఎండీని టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలు డీఎస్పీ వెంకటరాముడు.. సీఐ భాస్కర్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనహాల్ గ్రామానికి చెందిన ముళ్లపూడి ఇసాక్ గత జనవరిలో పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో జాన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, జాన్ ఫైనాన్స్ అండ్ జ్యువెలరీ స్కీం కార్యాలయాన్ని ప్రారంభించారు. 14 మందిని ఫీల్డ్ ఆఫీసర్లుగా నియమించుకొని 282 మంది సభ్యులను చేర్చుకున్నాడు. వారి వద్ద నుంచి డిపాజిట్ రూపంలో దాదాపు రూ.30 లక్షలు సేకరించాడు. గడువు ముగిసినా లోన్లు, బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడంతో ఎండీ పరారయ్యాడు.
ఈ నేపథ్యంలో శ్రీరామనగర్‌కు చెందిన బాధితుడు దేవప్రసాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత మే 10న ఫిర్యాదు చేశాడు. దేవప్రసాద్‌తో పాటు మరికొంతమంది బాధితులు రాఘవేంద్రమ్మ, లక్ష్మీ, గౌస్, జాఫర్, రఫీక్ కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా శనివారం ఎండీ ముళ్లపూడి ఇసాక్ కల్లుబావిలోని ఆటో స్టాండ్ వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో భార్య రెబెకాకు రూ.23 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని, ఆమె కోసం గాలిస్తున్నామని, త్వరలోనే నగదు రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా ఎమ్మిగనూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి బాధితుల నుంచి రూ.20 లక్షల వరకు డిపాజిట్లు వసూలు చేసి ముఖం చాటేశాడని డీఎస్పీ చెప్పారు. 2014లోనూ దొంగనోట్ల కేసులో గంగావతి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment