
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బండి సంజయ్ పాదయాత్రపై దాడికి తెగబడ్డారని విమర్శించారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.
'టీఆర్‌ఎస్ చౌకబారు, చిల్లర రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అసహనంతో, నిరాశ నిస్పృహలో దాడులకు పాల్పడుతున్నారు. పాదయాత్ర యధావిధిగా అనుమతివ్వాలని, జరిగిన ఘటనపపై విచారణ జరపాలని' ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
మునుగోడు బీజేపీదే
లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోందని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కామ్‌ను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్‌ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని.. రాబోయే మునుగోడు ఎన్నికలో బీజేపీ గెలవబోతోందని విజయశాంతి పేర్కొన్నారు.