ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల స్వపక్షంలో విపక్షం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. విపక్షాల పాత్ర సొంత పార్టీ వారే పోషిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో మేయర్ నిర్ణయాలను డిప్యూటీ మేయర్ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. తెరాస కార్పొరేటర్లు నగరపాలక సంస్థ సమావేశాన్నే బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని గులాబీ పార్టీలో వర్గ విభేదాలు రచ్ఛకెక్కాయి. టీఆర్ఎస్ మేయర్‌పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏకపక్ష నిర్ణయాలపై అధికార పార్టీ వారే నిరసన గళం విప్పారు. రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామగుండం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉంటే.. వాటిలో 37 డివిజన్లకు టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు బహిష్కరించారు.
మేయర్‌పై అసంతృప్తితో నిరసనకు దిగారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో మేయర్ బంగి అనిల్ కుమార్ సమావేశాన్ని గంటన్నర పాటు వాయిదా వేశారు. నామినేషన్ల బిల్లుల చెల్లింపు ఎజెండాపై సమావేశాన్ని బహిష్కరించిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో మేయర్ తన చాంబర్లో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం.
నామినేషన్ పనులపై ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో వాటికి బిల్లులు ఎలా చెల్లిస్తారని కార్పొరేటర్లు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎజెండాలో ఎందుకు పెట్టారని, పెట్రోల్ బంకు కోసం మున్సిపల్ ఆఫీసులోని స్థలాన్ని కేటాయిస్తూ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. డివిజన్లలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వారు మేయర్ మీద దండెత్తారు. మేయర్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
ఒక దశలో మేయర్, కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని తెలిసింది. చివరికి శాంతించిన అధికారపార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఎజెండాలో చేర్చిన 430 అంశాలపై కౌన్సిల్లో చర్చించారు. రూ.280 కోట్ల నామినేషన్ పనుల బిల్లుల చెల్లింపు అంశాలను కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో వాటిని పక్కకు పెట్టారు. పెట్రోల్ బంక్‌కు స్థలం కేటాయింపు అంశాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ వ్యవహారంపై రామగుండంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు మాయం అయిన ఫైల్స్ మళ్లీ ఎజెండాలోకి ఎందుకు తీసుకు రావాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్లు, మేయర్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చేలా పాలన ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రామగుండంలోని వంటి పరిస్థితే సిరిసిల్లలోనూ ఏర్పడింది. అక్కడి విభేదాలను స్వయానా సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పరిష్కరించారు. కరీంనగర్‌లోనే ఉన్న రామగుండం కార్పొరేషన్‌లో కూడా ఇలాంటి పరిస్థితే రావడం గులాబీ పార్టీ పెద్దలకు తలనొప్పే అంటున్నాయి పార్టీ శ్రేణులు.
Comments
Please login to add a commentAdd a comment