ramagundam corporation
-
Ramagundam: స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల స్వపక్షంలో విపక్షం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. విపక్షాల పాత్ర సొంత పార్టీ వారే పోషిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లో మేయర్ నిర్ణయాలను డిప్యూటీ మేయర్ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. తెరాస కార్పొరేటర్లు నగరపాలక సంస్థ సమావేశాన్నే బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని గులాబీ పార్టీలో వర్గ విభేదాలు రచ్ఛకెక్కాయి. టీఆర్ఎస్ మేయర్‌పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏకపక్ష నిర్ణయాలపై అధికార పార్టీ వారే నిరసన గళం విప్పారు. రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే.. వాటిలో 37 డివిజన్లకు టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు బహిష్కరించారు. మేయర్‌పై అసంతృప్తితో నిరసనకు దిగారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో మేయర్ బంగి అనిల్ కుమార్ సమావేశాన్ని గంటన్నర పాటు వాయిదా వేశారు. నామినేషన్ల బిల్లుల చెల్లింపు ఎజెండాపై సమావేశాన్ని బహిష్కరించిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో మేయర్ తన చాంబర్లో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. నామినేషన్ పనులపై ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో వాటికి బిల్లులు ఎలా చెల్లిస్తారని కార్పొరేటర్లు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎజెండాలో ఎందుకు పెట్టారని, పెట్రోల్ బంకు కోసం మున్సిపల్ ఆఫీసులోని స్థలాన్ని కేటాయిస్తూ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. డివిజన్లలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వారు మేయర్ మీద దండెత్తారు. మేయర్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఒక దశలో మేయర్, కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని తెలిసింది. చివరికి శాంతించిన అధికారపార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఎజెండాలో చేర్చిన 430 అంశాలపై కౌన్సిల్లో చర్చించారు. రూ.280 కోట్ల నామినేషన్ పనుల బిల్లుల చెల్లింపు అంశాలను కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో వాటిని పక్కకు పెట్టారు. పెట్రోల్ బంక్‌కు స్థలం కేటాయింపు అంశాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ వ్యవహారంపై రామగుండంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు మాయం అయిన ఫైల్స్ మళ్లీ ఎజెండాలోకి ఎందుకు తీసుకు రావాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్లు, మేయర్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చేలా పాలన ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామగుండంలోని వంటి పరిస్థితే సిరిసిల్లలోనూ ఏర్పడింది. అక్కడి విభేదాలను స్వయానా సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పరిష్కరించారు. కరీంనగర్‌లోనే ఉన్న రామగుండం కార్పొరేషన్లో కూడా ఇలాంటి పరిస్థితే రావడం గులాబీ పార్టీ పెద్దలకు తలనొప్పే అంటున్నాయి పార్టీ శ్రేణులు. -
నిర్లక్ష్యానికి నిదర్శనం..!
గోదావరిఖనిటౌన్: అభివృద్ధి పేరిట చేసే ఏ పని అయినా, ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినపుడే అది అభివృద్ధి అనిపించుకుంటుంది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా చేసే పనులు ఏవైనా సబబు కాదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లో పలురకాల అభివృద్ధి పనుల కోసం కార్పొరేషన్ అధికారులు ఇటీవల వేసిన సీసీ రోడ్లను తవ్వారు. అయితే నెలలు గడిచినా ఇప్పటికీ మరమ్మతు చేయక పోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగు నీరు, మరుగు దొడ్లు, రోడ్డు వెడల్పు, ఇతర పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి పునః నిర్మాణం చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రతినిత్యం రోడ్ల వెంబడి నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం.. అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి రెండు నెలల్లో పూర్తి చేసి యథావిధిగా ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యవంతంగా నిర్మించాలి. అయితే సంవత్సరాలు గడిచినా పునః నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతీ నిత్యం నడవడానికి, వాహనాలను తీసుకుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను ముందే ఆలోచించి నిర్మించకపోవడంతో కోట్ల రూపాలయతో వేసిన రోడ్డు మధ్యంతరంగా చెరిపి తిరిగి వేయడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెగుతున్న ఇంటర్నెట్ తీగలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లను తవ్వడంతో రోడ్డు క్రింద ఉన్న ఇంటర్నెట్, బీఎస్ఎన్ఎల్ వైర్లు తెగి నెట్ వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు, విద్యార్థులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉద్యోగాల కోసం, విద్యాపరంగా ఉండే అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నామని పేర్కొంటున్నారు. తాగునీటిలో మలిన పదార్థాలు.. అయితే రోడ్లను తవ్వే సమయంలో వాటి కింద ఉండే తాగు నీటి పైపులు పగిలి నీటిలో మట్టి, ఇసుక, ఇతర మలిన పదార్థాలు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లను బాగు చేయాలి స్థానికంగా వివిధ అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి. ఇంటి ఎదుట నుంచి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించాలి. – నరేశ్, స్థానికుడు కలుషితం అవుతున్న తాగునీరు మరమ్మతుల కోసం రోడ్లను తవ్వడంతో తాగు నీటి పైపులు పగలడంతో తాగు నీరు కలుషితం అవుతోంది. దీంతో వ్యాధుల బారిన పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగు నీరు కలుషితం కాకుండా చూడాలి. – మురళి, స్థానికుడు -
ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌తో ఇబ్బందులు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్ పరిధిలో గల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్ ధాటికి గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫ్యాన్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఫ్యాన్ కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్‌నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్‌నగర్ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు. దీనికితోడు రామగుండం కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్ అధికారులు బ్లాస్టింగ్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
టీఆర్ఎస్లో చేరిన ‘ఖని’ కాంగ్రెస్ కార్పొరేటర్లు
పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్‌కు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 1, 2, 3, 6, 28, 29, 35, 36 డివిజన్ కార్పొరేటర్లు బద్రి రజిత, నస్రీనాబేగం, కత్తెరమల్ల సుజాత, నడిపెల్లి అభిషేక్‌రావు, షేక్ బాబూమియా, బొబ్బిలి సతీష్, చుక్కల శ్రీనివాస్, పాముకుంట్ల లలిత టీఆర్ఎస్లో చేరడానికి హైదరాబాద్ బయలుదేరారు. వారి వాహన శ్రేణి ని నగర మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, రాజయ్య, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డెప్యూటీ మేయర్ సాగంటి శంకర్, అధ్యక్షుడు దీటి బాలరాజు, నాయకులు సోమారపు అరుణ్‌కుమార్, నడిపెల్లి సాగర్‌రావు, పాముకుంట్ల భాస్కర్, బద్రి రాజు పాల్గొన్నారు. కాగా.. ఎనిమిది మంది కార్పొరేటర్లు చేరడంతో రామగుండం కార్పొరేషన్లో టీఆర్ఎస్ బలం 36కు చేరింది. -
‘రింగ్’కు కాంట్రాక్టర్ల మంతనాలు
కోల్‌సిటీ : రామగుండం కార్పొరేషన్లో రూ.10.48 కోట్లతో 89 అభివృద్ధి పనులను చేపట్టడానికి ఇటీవల అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కొంతమంది సివిల్ కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2015-16 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులతో వివిధ పనులు నిర్వహించేందుకు రెండు విడతలుగా టెండర్లు ఆహ్వానించారు. షెడ్యూళ్లు దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతుండటంతో రింగ్ తిప్పడంతో ఆరితేరిన సీనియర్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. మంగళవారం మార్కండేయకాలనీలోని ఓ ప్రాంతంలో కాంట్రాక్ట ర్లు రహస్యంగా సమావేశమయ్యూరు. అభివృద్ధి పనుల ను ఎవరెవరికి కేటాయించాలనే దానిపై చర్చలు జరిపా రు. కాంట్రాక్టర్లు పోటీపడి టెండర్లు వేయకుండా ఉం డేందుకు మంతనాలు జరిపారు. ముఖ్యంగా సొసైటీల పేరుతో టెండర్లు వేస్తున్న కాంట్రాక్టర్లపై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కాంట్రాక్టర్లతో విడివిడిగా మాట్లాడి రింగ్‌కు సహకరించాలని నచ్చజెప్పుతున్నట్లు సమాచారం. గతంలో ఓ కాంట్రాక్టర్ సొసైటీ పేరుతో టెండర్ వేస్తే అతనికి దక్కనీయకుండా కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తితో టెండర్ వేయించారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది పెద్ద కాంట్రాక్టర్ల మధ్య గు త్తాధిపత్యం కొనసాగుతోంది. దీంతో వారు చెప్పినట్లు వినకుంటే కార్పొరేషన్లో ఒక్క టెండర్ కూడా దక్కనీ యకుండా చేస్తామనే ధోరణిలో చిన్న కాంట్రాక్టర్లను బె దిరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు వంతపాడుతుండటం వల్ల రామగుండం కార్పొరేషన్లో టెండ ర్లు అభాసుపాలవుతున్నాయనే అభిప్రాయూలున్నారుు. రెండు విడతల్లో టెండర్లు.. * రూ.10.48 కోట్ల నిధులతో 89 అభివృద్ధి పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెంటర్లు ఆహ్వానించారు. మొదటి విడతలో రూ.554.64 లక్షల అంచనా వ్యయంతో 22 పనులకు టెండర్లు పిలిచారు. వీటికి ఈనెల 10న టెండర్ షెడ్యూళ్లు డౌన్లోడ్ కు గడువు ఇచ్చారు. టెండర్ల స్వీకరణ, పరిశీలన కూడా ఇదే రోజున పూర్తి చేయనున్నారు. * రెండవ విడతలో రూ.493.96 లక్షల అంచనాల వ్యయంతో 67 పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 11న డౌన్లోడ్ ముగింపు, అదేరోజున టెండర్ల స్వీకరణ, అనంతరం పరిశీలన ఉంటుందని అధికారులు వెల్లడించారు. రెండు మూడు రోజులు మాత్రమే టెండర్లకు గడువు ఉండడంతో కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా పాలువులు కదుపుతున్నారని తెలిసింది. -
130 బార్లకు 2,100 దరఖాస్తులు
- ఒక్కో బార్ కోసం 5 నుంచి 10 పేర్లతో అప్లికేషన్లు - వచ్చే నెల 15 తరువాత డ్రా తీసే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జీహెచ్ఎంసీ, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా 130 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 60 బార్లకు దాదాపు 200 దరఖాస్తులురాగా, మిగతా 70 బార్ల కోసం ఏకంగా 1,900 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హతగల దరఖాస్తులను ఎంపిక చేసే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో గత జూన్ వరకు 756 బార్లు ఉండగా జనాభా ప్రాతిపదికన బార్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న 497 బార్లకుగాను మరో 60 అదనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రస్తుతం 7 బార్లు ఉండగా కొత్తగా మరో 4 ఏర్పాటు కానున్నాయి. అలాగే రామగుండం కార్పొరేషన్లో ప్రస్తుతమున్న 6 బార్లను 8కి పెంచనున్నారు. 21 నగర పంచాయతీల్లో 30 బార్లు, 20 మున్సిపాలిటీల్లో కొత్తగా 29 బార్లు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నగర పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉండే లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, రిటైల్ మద్యం దుకాణాల యజమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఒక్కో బార్ కోసం ఒక్కొక్కరు వివిధ పేర్లతో 5 నుంచి 10 దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు కేవలం రూ. 5,000గా నిర్ణయించడంతో బార్ల కోసం బారులు తీరే పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరోవైపు బార్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్లో మొదలైంది. ప్రస్తుతం సెలవులు కావడంతో ఈ నెలాఖరు వరకు పరిశీలన, కంప్యూటరీకరణ పూర్తి చేయనున్నారు. వచ్చే నెల 15 తరువాత స్క్రూటినీలో మిగిలిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల వారీగా డ్రా తీసే అవకాశం ఉంది. -
23 గ్రామాల స్కూళ్లకు సెలవులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా 23 గ్రామాల్లోని విద్యాసంస్థలకు ఈ నెల 13 నుంచి 25 వరకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఈ రోజు వెల్లడించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరాలు జరిగే రామగుండం కార్పొరేషన్ లో కూడా యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెలవులు ప్రకటించినట్లు ఆయన వివరించారు.