ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా? పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులతో అధికారిక వాహనాలు అక్కడ దుమ్ము రేపుతున్నాయా? ఇంతకీ మునుగోడులో ఏం జరుగుతోంది?
ప్రచారం.. ఆపై అధికారుల హడావుడి
నల్గొండ జిల్లా మునుగోడు ఇప్పుడు తెలంగాణకు మరో రాజధానిగా మారిపోయిందన్నట్టుగా పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసింది. రాష్ట్ర కేబినెట్ మొత్తం అక్కడే ఉంది. వారి కోసం అధికారులు వచ్చి వెళుతున్నారు. దీంతో మునుగోడులో ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు అధికారుల రాకపోకలతో నానా హడావుడిగా తయారైంది. ఏ ఎన్నికల్లోనూ ఇంత హడావుడి చూడలేదంటున్నారు స్థానిక ప్రజలు.
ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి నాయకులు
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తక్కువేం తినలేదు. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సహా పలువురు కేంద్ర నాయకులు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కేంద్ర పెద్దల్లో ఒకరు బీజేపీ అభ్యర్థి కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతున్నందున అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చావో రేవో అన్నట్లుగా పోరాడుతుండటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
15 మంది మంత్రులు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రాష్ట్ర పరిపాలన అంతా మునుగోడు నుంచే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. 15 మంది రాష్ట్ర మంత్రులు, 71 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారంలో తలమునకలయ్యారు. కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది సీనియర్ మంత్రులు మునుగోడులోనే తిష్ట వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ కూడా బాగానే ఫైట్ చేస్తోంది. నిత్యం హైదరాబాద్‌లోనే కనిపించే కాంగ్రెస్ సీనియర్లంతా ఇప్పుడు మునుగోడులోనే ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా మునుగోడు ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు.
పాపం ఖాకీలు
కీలక నేతల పర్యటన, ప్రచారంతో పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కునుకు కరువైంది. స్థానిక పోలీసులకు తోడుగా ఇతర జిల్లాల నుంచి కూడా వేలాదిగా పోలీసులను అక్కడ మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ చెక్‌పోస్టులు, బారీకేడ్లు పెట్టి వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము చూడని పెద్ద పెద్ద కార్లు రావడం, ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ జామ్‌లతో మునుగోడు ప్రజలు సతమతమవుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక అనేక రకాలుగా చరిత్ర సృష్టించబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment