TRS Leader Tammineni Krishnaiah Brutally Murdered In Khammam - Sakshi
Sakshi News home page

తుమ్మల అనుచరుడి దారుణ హత్య 

Published Mon, Aug 15 2022 4:53 PM | Last Updated on Tue, Aug 16 2022 4:00 AM

TRS leader Murdered Brutally in broad daylight in Khammam - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం /ఖమ్మం రూరల్‌: వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబురాల వేళ ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి.

తెల్దారుపల్లి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. రాజకీయ కక్షతో వీరభద్రం, ఆయన సోదరులే ఈ హత్య చేయించారని కృష్ణయ్య కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. తన తండ్రి హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, మరో ఆరుగురు కారకులని పేర్కొంటూ కృష్ణయ్య కుమారుడు నవీన్‌ ఖమ్మం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ హత్యోదంతంతో కోపోద్రిక్తులైన కృష్ణయ్య బంధువులు, కుటుంబీకులు, అనుచరులు..వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు, అనుమానితుల ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. 

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి దాడి
కృష్ణయ్యకు భార్య (ఎంపీటీసీ) మంగతాయారుతో పాటు కుమార్తె రజిత, కుమారుడు నవీన్‌ ఉన్నారు. కుమారుడు గ్రానైట్‌ వ్యాపారం చేస్తుండగా, కృష్ణయ్య ఇటీవల వరకు సీపీఎంలోనే కొనసాగారు. కోటేశ్వరరావుతో విభేదాలు రావడంతో సీపీఎంను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల అనుచరుడిగా, టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సమితి సభ్యుడిగా కొనసాగుతున్నారు.

సోమవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పొన్నెకల్‌లోని రైతువేదికలో జాతీయ జెండా ఎగురవేసి, మండలంలోని గుర్రాలపాడులో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. వాహనాన్ని తెల్దారుపల్లికే చెందిన ముత్తేశం నడుపుతుండగా కృష్ణయ్య వెనుకాల కూర్చున్నారు.

గ్రామం సమీపిస్తుండగా వెనుక నుండి ఆటోలో వచ్చిన దుండగులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న చిన్న కాల్వలో పడిపోగానే తల్వార్లతో తలను, చేతులను ఇష్టారాజ్యంగా నరికారు. దీంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దుండగులు ఆటోలో తెల్దారుపల్లి గ్రామంలోకి వెళ్లారు. 

గ్రామస్తులే చంపారన్న ప్రత్యక్ష సాక్షి 
భయంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రత్యక్ష సాక్షి ముత్తేశం కాసేపటికి ఘటనాస్థలానికి వచ్చాడు. అక్కడే మీడియా, పోలీసులతో వేర్వేరుగా మాట్లాడాడు. గ్రామానికే చెందిన బోడపట్ల శ్రీను (తండ్రి చిన్న ఎల్లయ్య), గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడినట్లు చెప్పాడు. డాగ్‌స్క్వాడ్‌తో వచ్చిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా జాగిలం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ఇంటి వద్ద ఆగింది.

దీంతో కృష్ణయ్య అనుచరులు, కుటుంబీకులు, బంధువులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు అప్పటికే ఇంటి నుండి వెళ్లిపోయారు. గ్రామంలో సీపీఎం దిమ్మెలను ధ్వంసం చేయడంతో పాటు వీరభద్రం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను కృష్ణయ్య అనుచరులు చించేశారు. 

గ్రామంలో 144 సెక్షన్‌
కృష్ణయ్య హత్య జరిగిన 20 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్‌ విధించారు. ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. కృష్ణయ్య హత్య దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు అభివృద్ధికి అవరోధం కల్పిస్తాయని పేర్కొన్నారు. నిందితులెంతటి వారైనా వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

తమ్మినేని వీరభద్రమే హత్య చేయించారు..
గ్రామంలో సీపీఎంకు ఆదరణ తగ్గడం, కృష్ణయ్యకు మంచి పేరు వస్తుండటంతో తట్టుకోలేక తమ్మినేని వీరభద్రమే తన భర్త కృష్ణయ్యను హత్య చేయించినట్లు మంగతాయారు విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన తండ్రి హత్యకు వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావే కారణమని, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నంచడంతో హత్యకు పాల్పడ్డారని కృష్ణయ్య కుమార్తె రజిత ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement