సాక్షి, ఖమ్మం : నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను నిర్దేశించనున్నాయా... అంటే అవుననే సమాధానమే వస్తోంది. పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎన్నికలనే గీటురాయిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల అనంతరం ప్రజాతీర్పు ఆధారంగా నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు ఈ విషయమై దృష్టి సారించినట్లు సమాచారం.
టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం..
అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య అధికంగానే ఉంది. పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారితోపాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటివరకైతే గుంభనంగానే ఉంటున్నారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ రెండేసి వర్గాలు ఉండగా... ఆయా వర్గాల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పాలేరు, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మునుగోడు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌లో భారీ కుదుపు ఉండొచ్చనే ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్‌కు ప్రాణసంకటం
కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పుంజుకోవాలంటే చెప్పుకోదగిన రీతిలో స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు కలిగిన నేతల అవసరం ఉండగా... ప్రజావ్యతిరేక చర్యలపై నిరసనలు తెలుపుతున్నా నాయకులు ఏకతాటిపైకి రావడం లేదు. ఈక్రమాన జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ ఫలితాలే ఆధారమని చెబుతున్నారు. పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడితే జిల్లాలో ఇతర పార్టీల్లోని కొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగమమవుతుంది. లేకుంటే ‘హస్తానికీ’ గడ్డు రోజులు తప్పేలా లేవు. చదవండి: (Rangareddy Politics: మంత్రి సబిత ఇంటికి వెళ్తే.. ఆ పార్టీ నాయకులకు చిక్కులే!)
వలసలపైనే దృష్టి
జిల్లాలో చెప్పుకోదగ్గ బలం లేని భారతీయ జనతా పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా బలపడాలన్న ఆలోచనలో ఉంది. కానీ బీజేపీ పరిస్థితి జిల్లాలో అంతంత మాత్రంగానే ఉండటంతో ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని.. అప్పుడే పార్టీలో చేరేందుకు ఎక్కువమంది నేతలు ఆసక్తి చూపుతారని ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి వలసలను ప్రోత్సహించడంతోపాటు క్షేత్రస్థాయిలో కేడర్‌ను పెంచుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు. మునుగోడు ఎన్నిక ఫలితం అనుకూలంగా వస్తే.. ఆపై వలస నేతల చరిష్మాతో ఉమ్మడి జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించొచ్చన్న ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.
గెలిచిన పార్టీకే జై..
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన పార్టీకే జై కొట్టేందుకు పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ బలంగా ఉండగా... కమ్యూనిస్టులు కూడా కొంతమేర ప్రభావం చూపించే అవకాశముంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ పరిణామాలపై అసంతృప్త నేతలు దృష్టి సారించినందున మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి అసంతృప్త నేతలు వెళ్లే అవకాశముండడంతో బలం మరింత పెరిగే ఆస్కారముందనే చర్చ జరుగుతోంది.
ఆచితూచి కామ్రేడ్స్
బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పేర్కొంటున్నాయి. మునుగోడులో తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సీపీఎం మాత్రం నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి కమ్యూనిస్టులు ఆ పార్టీకే మద్దతు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కామ్రేడ్లు కూడా మునుగోడు ఫలితాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటు వైపు మొగ్గుచూపుతారో స్పష్టత రానుంది. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు వేర్వేరుగా కాకుండా కలిసే ఇతర పార్టీలతో పొత్తుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇలా రకరకాల సమీకరణలతో మునుగోడు ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుందో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment