పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: టీఆర్‌ఎస్ పార్టీని వీడేదిలేదని, అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే కడ వరకూ పనిచేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
కొందరు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని శేఖర్‌రెడ్డి తెలిపారు. (క్లిక్: మునుగోడులో బెట్టింగ్‌ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!)
19న బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య?
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ డా. బూర నర్సయ్యగౌడ్ ఈ నెల 19న బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ చేరికకు సంబంధించిన అంశాలు, నిర్వహించాల్సిన కార్యక్రమంపై చర్చించేందుకు బూర నర్సయ్యతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం భేటీ కానున్నారు. బూర నర్సయ్య నివాసానికి సంజయ్, ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. మునుగోడు పరిధిలో లేదా భువనగిరిలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీలో నర్సయ్యగౌడ్ కలుసుకున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు వచ్చినా పార్టీ మారేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత నర్సయ్య మాట్లాడారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై కార్యకర్తలు, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయ్యాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment